ఏపీ పోలీసులపై తిరగబడ్డ జనం..జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఘటన

ఏపీ పోలీసులపై తిరగబడ్డ జనం..జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఘటన
  •     తుంగభద్ర నదిలో ఇసుక పంచాయితీయే కారణం

గద్వాల, వెలుగు: తుంగభద్ర నదిలో ఏపీ, తెలంగాణ మధ్య ఇసుక పంచాయితీలో ఏపీ పోలీసులపై జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి ప్రజలు తిరగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొంత కాలంగా తుంగభద్ర నదిలో ఏపీ, తెలంగాణ మధ్య బార్డర్  సమస్య నెలకొంది. తమ పరిధిలోకి వచ్చి తెలంగాణ వాళ్లు ఇసుకను దొంగతనంగా తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లను మఫ్టీలో ఉన్న ఏపీ పోలీసులు పట్టుకున్నారు. కొద్ది సేపటికే మరో మూడు వెహికల్స్ లో ఏపీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

ఎడ్ల బండ్లను, ఇసుక ట్రాక్టర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రాజోలి గ్రామంలోని జనాలు అంతా తరలివచ్చి ఏపీ పోలీసులపై తిరగబడ్డారు. తాము ఏపీ బార్డర్  దాటలేదని, తెలంగాణ బార్డర్ లోనే తుంగభద్ర నదిలో లావు ఇసుకను తీసుకొచ్చి పెట్టుకున్నామని చెబుతున్నారు. ఏపీ పోలీసులు వచ్చి తమపై జులుం ప్రదర్శించడం ఏమిటని మండిపడ్డారు. ఏపీ పోలీసులు పట్టుకున్న ఎడ్ల బండ్లను, ట్రాక్టర్లను విడిపించుకొని ఊళ్లోకి తీసుకెళ్లారు.

 ప్రజలు ఎక్కువగా తరలివచ్చి వాగ్వివాదానికి దిగడంతో పరిస్థితి చేజారి పోతుందని గ్రహించిన ఏపీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ పోలీసులు వచ్చారని రాజోలి ఎస్సై గోకారి తెలిపారు. తెలంగాణ బార్డర్  పరిధిలోనే రాజోలి వాసులు ఇసుక తీస్తున్నారని, ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తీసుకొస్తే ఏం చేయలేని పరిస్థితి ఉందన్నారు.