రెండు వేల నోటు..వద్దంటున్నరు.. జనాలకు తప్పని తిప్పులు 

రెండు వేల నోటు..వద్దంటున్నరు.. జనాలకు తప్పని తిప్పులు 
  • రెండు వేల నోటు..వద్దంటున్నరు
  • హాస్పిటళ్లు, పెట్రోల్ బంక్​లు, షాప్ లు, వైన్స్ వద్ద బోర్డులు
  • బ్యాంకుల వద్ద మార్చుకునే అవకాశం కల్పించినా  జనాలకు తప్పని తిప్పులు 

హైదరాబాద్, వెలుగు:  రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వాటిని మార్చుకునేందుకు జనం తంటాలు పడుతున్నారు. సామాన్యుల వద్ద ఆ నోట్లు పెద్దగా లేనప్పటికీ.. ఉన్న వాటిని ఎవరూ తీసుకోకపోవడంతో వాటిని మార్చుకునేందుకు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. హాస్పిటల్స్, మెడికల్ ​షాపులు, పెట్రోల్ బంక్​లు, కిరాణా షాపులు, వైన్స్​ల వద్ద, ఇతర వ్యాపారస్తులు ఎవరూ తీసుకోవడం లేదు. కొన్ని చోట్ల తీసుకోమని ఏకంగా బోర్డులు పెట్టేస్తున్నారు. అయితే, ఎక్కడైతే ఆ నోట్లను తీసుకుంటున్నారో జనం అక్కడికి పరుగులు తీస్తున్నారు.

పెద్దగా కానొస్తలే..

రెండు వేల రూపాయల నోట్లు లాస్ట్ ఇయర్ నుంచే పెద్దగా చలామణిలో లేవు. ఏటీఎంలలో డ్రా చేసినా రావడం లేదు. బ్యాంకుల్లో నగదు తెచ్చినా ఒకటి, రెండు మినహా మిగతావన్నీ రూ.500 నోట్లే ఇచ్చేవారు. ఇలా సామాన్య జనం వద్ద నుంచి 2 వేల నోట్లు వెళ్లడమే తప్ప తిరిగి వారి వద్దకు రాలేదు. చాలా కొద్ది మంది దగ్గర.. అదీ కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. కాలనీల్లోని షాపులు, మార్కెట్ల వద్ద అయితే ఆ నోటు అసలు కానొస్తలేదు. ఎవరిని పలకరించినా రెండువేల నోటు చూడక ఏడాది దాటిందనే సమాధానం వినిపిస్తోంది.

జమ అయితే రిస్క్ అని..

రెండు వేల నోట్లని బ్యాంకుల్లో మార్చుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. నేటి నుంచి రూ.20 వేల(పది నోట్లు) చొప్పున ఎటువంటి ఫ్రూఫ్ లేకుండా మార్చుకోవచ్చని, వ్యాపారులైతే వారి బిజినెస్ డీటైల్స్​ఆధారంగా ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ జనం వద్ద నుంచి వ్యాపారులు 2 వేల నోట్లను తీసుకోవడం లేదు. వాటిని తీసుకుని తమ వద్ద జమ చేసుకుని, ఆపై అకౌంట్​లో ఎక్కువ డబ్బులు ఉంటే రిస్క్ అవుతుందేమోనని భయపడి కొందరు తీసుకోవడం లేదు.

పెద్ద పెద్ద మార్కెట్లలో బంద్

రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన మరుక్షణం నుంచి సిటీలోని హోల్​సేల్ మార్కెట్లలో ఎక్కడ కూడా ఆ నోట్లను తీసుకోవడం లేదు. బేగంబజార్, ఉస్మాన్ గంజ్, చార్మినార్, జగదీశ్ మార్కెట్, సికింద్రాబాద్ సీటీసీ, రాణిగంజ్ తదితర బడా మార్కెట్లలో ఈ నోట్లను అస్సలు యాక్సెప్ట్ ​చేయడం లేదు. ఈ మార్కెట్లలోని కొందరు వ్యాపారులు సాధారణ సమయంలోనే ఆన్​లైన్ పేమెంట్లను తీసుకోరు. ఎంత పేమెంట్ అయినా క్యాష్ మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు రెండువేల నోటుని కూడా తీసుకోవడం లేదు.

2 వేల నోట్ ​తీసుకుంటున్నం

గతేడాది నుంచి రెండు వేల నోట్లు చాలా  తక్కువగా వస్తున్నాయి. కొన్ని రోజులపాటు ఆ నోట్లు కనిపించనే లేదు. కానీ నోట్ల ఉపసంహరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి వినియోగదారుల నుంచి ఎక్కుగా వస్తున్నాయి. బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం ఉండటంతో గిరాకీ ఎందుకు పోగొట్టుకోవాలని ఆ నోట్లను తీసుకుంటున్నాం.

 - బాషా, భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ ఓనర్, మూసాపేట

బ్యాంకులో కష్టం అవుతుందేమోనని..

గతంలో రూ.2 వేల నోట్లు తక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు అందరూ అవే తీసుకొచ్చి లిక్కర్ కొంటున్నారు. బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు కష్టం అవుతుందేమోనని ఆ నోట్లను తీసుకోవడం లేదు. 
- రాజు క్యాషియర్, మధుశాల వైన్స్, హైదర్​గూడ