రేవంత్‌‌‌‌ పాలన బాగుందని ప్రజలు భావిస్తున్నరు : గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి

రేవంత్‌‌‌‌ పాలన బాగుందని ప్రజలు భావిస్తున్నరు : గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి
  •     జిల్లాలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పరిస్థితులు బాగా లేవు
  •     రాజ్యాంగ పదవిలో ఉన్నా.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరను

నల్గొండ, వెలుగు : వంద రోజుల రేవంత్‌‌‌‌ పాలన బాగుందని, ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని శాసనమండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి చెప్పారు. శుక్రవారం నల్గొండలో మీడియా చిట్‌‌‌‌చాట్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో రెండు సార్లు మాత్రమే రేవంత్‌‌‌‌రెడ్డిని కలిశానని, వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదన్నారు. అమిత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌లోకి రావాలన్న ప్రతిపాదన నెల రోజుల కిందే వచ్చిందని, ప్రస్తుతం ఆ విషయం పెండింగ్‌‌‌‌లోనే ఉందన్నారు.

అమిత్‌‌‌‌ కోమటిరెడ్డిని, వేం నరేందర్‌‌‌‌రెడ్డిని కలిసిన విషయం వాస్తవమేనని, అయితే అది వ్యక్తిగత కలయికే తప్ప రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తరఫున ఎంపీగా పోటీకి దూరంగా ఉన్న విషయాన్ని ఇప్పటికే హైకమాండ్‌‌‌‌కు తెలియజేశానన్నారు. ఒక వేళ పార్టీ మళ్లీ సంప్రదింపులు జరిపి టికెట్‌‌‌‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు బాగా లేవని, సమన్వయ లోపం, సంస్థాగత నిర్మాణలోపం ఉందన్నారు. టీడీపీలో క్రమశిక్షణ, పార్టీ నిర్మాణం ఉన్నందువల్లే 2014లో 18 స్థానాలు గెలుచుకుందని గుర్తు చేశారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో ఎమ్మెల్యేల చుట్టే రాజకీయం నడుస్తూ పార్టీ నిర్మాణం జరగకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తాను అందరినీ కలవడంలోనూ, వారు  వచ్చి తనను కలవడంలోనూ తప్పేమీ లేదన్నారు.