
దేశ భవిష్యత్ పై దూరదృష్టితో ఆలోచిస్తూ భావితరాల్లో భరోసా నింపేలా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఐటీ, కమ్యూనికేషన్స్, పరిశోధన, ఆర్థిక, విద్య, పంచాయతీ రాజ్, పరిపాలన, ఎన్నికలు ఇలా అన్ని రంగాల్లోనూ విజనరీ నేతగా పలు సంస్కరణలకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారు.
నాడు ఆయన వేసిన బీజాలే నేడు మహావృక్షాలుగా మారి ఆ ఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. పిన్న వయస్సులో 40 ఏళ్లకే దేశంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టిన రాజీవ్ గాంధీ ఐదేళ్ల పాలనలో దేశ అభివృద్ధికి పునాదులు వేశారు. మూస పద్ధతుల్లో కాకుండా ఆధునికమైన దృక్పథంతో నిర్ణయాలు తీసుకున్న ఆయన ఆలోచనలు నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆధునిక యుగంలో ప్రపంచంతో పోటీపడేలా 21వ శతాబ్దిలో దేశాన్ని నూతన పథంలో నడిపించేలా రాజీవ్ గాంధీ ముందుచూపుతో నేడు మనం అగ్రదేశాల సరసన నిలబడ్డాం. రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 1984 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన 414 స్థానాల రికార్డు ఇప్పటికీ చిరస్థాయిగానే నిలిచిపోయింది. దేశ ప్రజలు ఎంతో నమ్మకంతో అందించిన భారీ విజయాన్ని ఆయన ప్రజల ఆశయాల కోసమే అంకితం చేశారు.
దేశం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూసుకుపోతుందంటే దానికి కారణం నాడు రాజీవ్ సాంకేతిక రంగానికి పెద్దపీట వేయడమే. ఆయన ఐటీ, టెలికాం రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కంప్యూటర్ల వ్యవస్థకు నాంది పలికారు. ప్రభుత్వ పాలనలో,
ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాల్లో కంప్యూటర్లను ప్రవేశపెడితే వ్యతిరేకత వచ్చినా ఆయన ముందుకే సాగారు. కంప్యూటర్లతో ఉద్యోగాల్లో కోతలు పడతాయనే భావనతో కొన్ని సంఘాలు నిరసనలు తెలిపినా రాజీవ్ గాంధీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వెనకడుగు వేయలేదు. ఇప్పుడు మన దైనందిన జీవితాల్లో సెల్ఫోన్లు, కంప్యూటర్లు భాగంగా మారాయంటే ఆ పుణ్యం రాజీవ్ గాంధీకే దక్కుతుంది.
సాంకేతిక రంగానికి ప్రాధాన్యం
సాంకేతిక రంగానికి ప్రాధాన్యతనిస్తూ రాజీవ్ గాంధీ 1984లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్‌ను పటిష్టపరచడంతో టెలిఫోన్ రంగంలో ఊహించని మార్పులొచ్చి ఎస్టీడీ, పీసీఓ వ్యవస్థలు దేశంలో సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సంస్థలను రాజీవ్ గాంధీ ప్రోత్సహించడంతో దేశంలో ఐటీ రంగం పుంజుకుంది. అంతేకాక ఇస్రో, డీఆర్డీఓ, సీఎస్ఐఆర్ సంస్థల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఫలితంగా మన దేశీయ సాంకేతిక పురోగతిలో పయనిస్తోంది. యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ యువతరం కోసం నిత్యం ఆలోచిస్తూ తీసుకున్న నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన ఐటీ రంగంలోనే కాకుండా విద్యారంగంలో కూడా సంస్కరణలు చేపట్టారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం1985లో ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడంతో అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అనేక ఓపెన్ యూనివర్సిటీలు వెలిశాయి. బడుగు, బలహీన వర్గాలకు ప్రయోజనం కల్పించేలా 1986లో రాజీవ్ గాంధీ జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించి అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చారు.
ఐటీ, విద్య రంగాల్లో సంస్కరణలు
యువత ప్రయోజనాలే లక్ష్యంగా ఐటీ, విద్య రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ రాజకీయాల్లో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 61వ రాజ్యాంగ సవరణతో ఓటేసేందుకు కనీస వయసును 21 నుంచి18 సంవత్సరాలకు తగ్గించారు. 1991 పార్లమెంట్ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను యువతకు కేటాయించి తాను మాటలకారి కాదని, చేతల్లో చూపిస్తానని రాజీవ్ గాంధీ నిరూపించారు. యువత విషయంలోనే కాకుండా ఎన్నికల వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టారు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని బలోపేతం చేశారు. దివంగత రాజీవ్‌గాంధీ ఎన్నికలకు సంబంధించి పలు సంస్కరణలు చేపట్టగా, ఇప్పుడు ఆయన కుమారుడు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో దేశంలో ఎన్నికల వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తుంటే రాహుల్ గాంధీ బలహీనుల పక్షాన పోరాడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా దేశంలో ఓటరు జాబితాల్లో దొంగ ఓట్లను చేర్చడం, అసలైన ఓట్లను తొలగించడంపై రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌తో పాటు ‘ఇండి’ కూటమిలోని పార్టీలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నాయి. తండ్రి అడుగుజాడల్లోనే ఎన్నికల వ్యవస్థలో సంస్కరణల కోసం నడుంకట్టిన రాహుల్ గాంధీకి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతివ్వాల్సిన ఆవశ్యకత ఉంది.
పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి
జాతిపిత మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం కలలను సాకారం చేసి రాజీవ్ గాంధీ దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. గ్రామస్థాయి నుంచి అధికార వికేంద్రీకరణ జరగాలనే సంకల్పంతో 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం దేశంలోని పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ మూడు అంచెల వ్యవస్థతో విశేష అధికారాలను కట్టబెట్టేందుకు 64వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగానే పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1993లో 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించింది. ఏ నాయకత్వం నేతృత్వంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం బడుగు, బలహీన వర్గాల కోసం తపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచాయతీ రాజ్ వ్యవస్థల అభివృద్ధికి సంస్కరణలు చేపట్టడంతో గ్రామాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే కాకుండా స్థానికసంస్థల ఎన్నికల్లో పొటీ చేసేందుకు మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్లు కూడా కల్పించడమైంది. కాంగ్రెస్‌లో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే, దురదృష్టవశాత్తు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును, ఆర్డినెన్స్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయాల దురుద్ధేశంతో ఆమోదించకుండా తాత్సారం చేస్తోంది. గతంలో స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించి వారికి రాజకీయంగా తీవ్ర అన్యాయం చేసిన బీఆర్ఎస్ కేంద్రంపై పోరాటానికి కాంగ్రెస్‌తో కలిసి రావడం లేదు.
ఆర్థిక సంస్కరణలు
ప్రభుత్వ పాలన ప్రజలకు పారదర్శకంగా అందుబాటులో ఉండాలని రాజీవ్ గాంధీ కాంక్షించారు. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు దేశానికి తరలివచ్చేలా ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. దేశంలో మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే తలంపుతో రాజీవ్ గాంధీ 1985లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను పీవీ నరసింహారావుకు అప్పగించారు. అమెరికా, సోవియట్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడమే కాకుండా 1985లో సార్క్ స్థాపనలో కీలకపాత్ర పోషించారు. కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్న తనకు వైద్యం కోసం రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ ఆర్థిక సాయం చేశారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి స్వయంగా ప్రకటించారు. 1988లో ఐక్య రాజ్యసమితి సమావేశంలో అణుబాంబు ద్వారా కాకుండా శాంతి, స్వేచ్ఛ, సమానత్వంతో మానవాభివృద్ధి సాధించవచ్చని రాజీవ్ గాంధీ చేసిన ప్రసంగానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
భారతరత్న అవార్డ్
శాంతికాముకుడైన రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఎల్టీటీఈ ఆత్మాహుతి దళం బాంబు దాడిలో మృతి చెందడం దురదృష్టకరం. ఆయన హత్యకు గురైన మే 21వ తేదీని భారత దేశంలో ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్నారు. ప్రపంచంతో పోటీపడేలా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ దేశాన్ని సంస్కరణల బాట పట్టించిన రాజీవ్ గాంధీకి మరణానంతరం ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ప్రకటించారు. ఆయన పేరున అత్యున్నతమైన క్రీడాకారులకు ప్రతిష్టాత్మకమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డు అందిస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విజనరీలతో అన్ని రంగాల్లో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన రాజీవ్ గాంధీ ఎన్ని తరాలైనా భారతదేశంలో చిరస్మరణీయంగా, స్ఫూర్తిదాయకంగా, దార్శనిక నేతగా నిలిచిపోతారు.
- బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు