ఎల్ఐసీ ఏజెంట్ బన్గయా డాక్టర్

ఎల్ఐసీ ఏజెంట్ బన్గయా డాక్టర్
  •  
  • ఎక్స్ రే టెక్నీషియన్.. చేసేది ఎంబీబీఎస్ వైద్యం
  • గ్రేటర్  వరంగల్ కాశిబుగ్గలో ఇద్దరు నకిలీ డాక్టర్లు

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్​లో ఓ ఎల్‍ఐసీ ఏజెంట్‍ డాక్టర్‍ అవతారం ఎత్తగా.. తానేం తక్కువ కాదన్నట్లు మరోచోట ఎక్స్​రేలు తీసే టెక్నీషియన్‍ సైతం స్టెతస్కోప్‍ పట్టి వచ్చిరాని వైద్యంతో పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇద్దరు నకిలీ డాక్టర్లపై తెలంగాణ మెడికల్‍ కౌన్సిల్‍ బృందం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. టీఎంసీ చైర్మన్‍ డాక్టర్‍ కె మహేశ్‍ కుమార్‍, రిజిస్ట్రార్‍ లాలయ్య కుమార్‍ ఆదేశాలతో సోమవారం సాయంత్రం కౌన్సిల్‍ మెంబర్‍, పబ్లిక్‍ రిలేషన్‍ కమిటీ చైర్మన్‍ డాక్టర్‍ వి.నరేశ్​కుమార్‍, యాంటీ క్వాకరీ కమిటీ మెంబర్‍ డాక్టర్‍ వి.రాకేశ్‍ బృందం క్లినిక్‍లలో తనిఖీలు చేపట్టారు.

వరంగల్‍ కాశిబుగ్గ తిలక్‍నగర్ ప్రాంతానికి చెందిన మామిడి ఈశ్వరయ్య ఎల్‍ఐసీ ఏజెంట్‍గా పని చేస్తున్నాడు. పనిలోపనిగా త్రివేణి క్లినిక్‍ పేరుతో డాక్టర్‍ అవతారమెత్తాడు. తనకు తానుగా డాక్టర్‍ అంటూ బోర్డులు పెట్టుకున్నాడు. మెడిసిన్‍ అంటకట్టేందుకు సేవ్య ఫార్మసీ నడుపుతున్నాడు. అంతేగాక ఆర్‍ఎంపీ వెల్ఫేర్‍ అసోసియేషన్‍ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‍ వృత్తిలో 40 ఇయర్స్  ఇండస్ట్రీ అని ప్రచారం చేసుకున్నాడు. ఎటువంటి పర్మిషన్ లేకుండా హస్పిటల్​లో మాదిరిగా బెడ్‍ ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణతో సంబంధం లేకుండా పేషెంట్లకు హైడోస్‍ యాంటిబయోటిక్స్, స్టెరాయిడ్స్, మలేరియా ఇంజక్షన్స్  ఇస్తూ వారి ప్రాణాలతో ఆడుకుంటున్నాడు.

ఇదే ప్రాంతంలో ఎక్స్ రే టెక్నీషియన్‍ కోర్స్  చదివిన ఎస్కే నయీమ్  డాక్టర్‍గా చలామణి అవుతున్నాడు. హిజమా కప్పింగ్‍ థెరపీ పేరుతో క్లినిక్  నడుపుతూ జనాలకు ఎంబీబీఎస్‍ వైద్యం అందిస్తున్నాడు. ట్రీట్‍మెంట్‍ కోసమని బెడ్స్  ఏర్పాటు చేసి అశాస్త్రీయ పద్ధతిలో యాంటిబయోటిక్స్, స్టెరాయిడ్స్​ ఇంజక్షన్ల రూపంలో ఇస్తున్నాడు. ఇష్టారీతిన సెలైన్లు పెడుతున్నాడు. ఇద్దరు నకిలీ డాక్టర్లపై ఎన్‍ఎంసీ యాక్ట్, తెలంగాణ స్టేట్‍ మెడికల్‍ ప్రాక్టిషనర్స్ రెగ్యులేషన్‍ యాక్ట్  ప్రకారం కేసులు నమోదు చేసినట్లు డాక్టర్‍ నరేశ్ తెలిపారు.