కరోనా తర్వాత పెద్ద ఫ్లాట్లను కోరుకుంటున్న జనాలు

కరోనా తర్వాత పెద్ద ఫ్లాట్లను కోరుకుంటున్న జనాలు
  • ఫ్లాట్​ పెద్దగుండాలి
  • ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షిస్తోన్న రియాల్టీ
  • పీఎంఏవై కింద లక్షన్నరకు పైగా కొత్త ఇండ్లు

న్యూఢిల్లీ: నగరాలలో అపార్ట్‌‌మెంట్ సైజులు పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ఇండ్ల కొనుగోలుదారులు ఎక్కువగా పెద్ద ఇళ్లను కోరుకుంటున్నారు. దీంతో ఇండియాలో యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజు 2016 నుంచి తొలిసారి పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ రీసెర్చ్‌‌లో తేలింది. అనరాక్ డేటా ప్రకారం టాప్ 7 సిటీల్లో సగటు అపార్ట్‌‌మెంట్ సైజు వార్షికంగా 10 శాతం వరకు పెరిగింది. 2019లో 1,050 చదరపు అడుగులుగా ఉన్న యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజు.. 2020లో 1,150 చదరపు అడుగులకు పెరిగినట్టు అనరాక్ చెప్పింది. గత నాలుగేళ్ల ట్రెండ్‌‌ని తీసుకుంటే.. 2016 నుంచి ఇయర్ ఆన్ ఇయర్ యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజులు తగ్గుతూ వచ్చాయి. 2017లో  ఏకంగా టాప్ 7 సిటీలలో యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజులు 13 శాతం వరకు తగ్గాయి. 2016లో 1,440 చదరపు అడుగులుగా యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజులు ఉంటే.. 2017లో ఇవి 1,260 చదరపు అడుగులుగానే ఉన్నాయి. ‘ముందటి ఏళ్లలో అపార్ట్‌‌మెంట్ సైజులు తగ్గడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. వాటిలో ఒకటి అఫర్డబులిటీ, రెండు తక్కువ నిర్వహణతో ఇండ్లను కట్టుకోవాలని మిలీనియల్స్ కోరుకోవడం. తక్కువ ధరతోనే  ఇండ్ల కొనుగోలుదారులను డెవలపర్లు ఎక్కువగా ఆకర్షించేవారు. ధర తక్కువ, దాంతో పాటు ఫ్లాట్ సైజులు కూడా తక్కువగా ఉండేవి. కానీ 2020లో ఈ ట్రెండ్ అంతా పూర్తిగా మారిపోయింది. కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారిపోయాయి. కరోనా రావడంతో చాలామంది ఇండ్లకే పరిమితమయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లల ఆన్‌లైన్ చదువులతో ఇంటి అవసరం బాగా పెరిగింది. దీంతో కాస్త పెద్ద ఇండ్లు కావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. నాలుగేళ్లలో తొలిసారి ఫ్లాట్ సైజులు పెరిగాయి’ అని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఛైర్మన్ అనుజ్ పురి చెప్పారు.

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌‌(ఎంఎంఆర్)లో ఎక్కువగా అపార్ట్‌‌మెంట్ల సైజులు పెరిగాయి. గరిష్టంగా 21 శాతం వరకు ఎగిశాయి. 2019లో 773 చదరపు అడుగులుగా ఉన్న అపార్ట్‌‌మెంట్ సైజులు.. 2020 నాటికి 932 చదరపు అడుగులకు పెరిగినట్టు అనరాక్ రీసెర్చ్‌‌లో వెల్లడైంది. ఆ తర్వాత అపార్ట్‌‌మెంట్ సైజులు పుణేలో పెరిగాయి. యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజు హైదరాబాద్‌‌లోనే చాలా ఎక్కువగా ఉంది. అన్ని టాప్ సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌‌లో అపార్ట్‌‌మెంట్ సైజు యావరేజ్‌‌గా 1,750 చదరపు అడుగులుగా రికార్డయింది. ఎంఎంఆర్‌‌‌‌తో పోలిస్తే రెండింతలు ఎక్కువగా హైదరాబాద్‌‌లో అపార్ట్‌‌మెంట్ సైజులున్నాయి. బెంగళూరులో యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజులు 3 శాతం పెరిగి 2020లో 1,320 చదరపు అడుగులకు చేరుకున్నాయి. ఈ సైజులు కిందటేడాది 1,280 చదరపు అడుగులుగా రికార్డయ్యాయి. అదేవిధంగా ఎన్‌‌సీఆర్ పరిధిలో కూడా యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజులు 2019లో 1,250 చదరపు అడుగులుంటే.. 2020లో 1,290 చదరపు అడుగులకు పెరిగాయి. వార్షికంగా 3 శాతం ఎగిశాయి. చెన్నైలో కూడా 9 శాతం వరకు అపార్ట్‌‌మెంట్ సైజులు పెరిగాయి. 2019లో 1,100 చదరపు అడుగులుంటే.. 2020లో 1,200 చదరపు అడుగులకు యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజు పెరిగింది. కోల్‌‌కత్తాలో కూడా అపార్ట్‌‌మెంట్ సైజులు పెరిగినట్టు అనరాక్ రీసెర్చ్ తెలిపింది. అక్కడ యావరేజ్ అపార్ట్‌‌మెంట్ సైజు 10 శాతం పెరిగి, 1,100 చదరపు అడుగులుగా నమోదైంది.

ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షిస్తోన్న రియాల్టీ…

ఇండియన్ రియల్ ఎస్టేట్‌‌పై ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. 2020లో మొత్తంగా 500 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులను ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టినట్టు జేఎల్‌‌ఎల్ ఇండియా రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది రియల్ ఎస్టేట్‌‌కు వచ్చిన ఇన్వెస్ట్‌‌మెంట్లలో ఎక్కువ భాగం ఆఫీసు అసెట్లకే వచ్చాయి. 2019లో 54 డీల్స్ ట్రాన్సాక్షన్స్ జరుగగా.. 2020లో 27 డీల్సే జరిగాయి. కానీ రెండు పెద్ద మొత్తంలో డీల్స్ రావడంతో ఇన్‌‌స్టిట్యూషన్ ఇన్వెస్ట్‌‌మెంట్లు పెరిగాయి. రెండు పెద్ద డీల్స్ వాల్యు 320 కోట్ల డాలర్ల వరకు ఉంది. 2020లో వచ్చిన మొత్తం ఇన్వెస్ట్‌‌మెంట్లలో వీటి వాటానే 65 శాతం వరకు ఉంది. బ్లాక్‌‌స్టోన్ గ్రూప్ నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ఆఫీసు, రిటైల్, హాస్పిటాలిటీ ఆస్తులను ప్రెస్టేజ్ ఎస్టేట్‌‌ నుంచి కొనుగోలు చేసింది. ఈ డీల్ వాల్యు 120 కోట్ల డాలర్లు కాగా.. బ్రూక్‌‌ఫీల్డ్ గ్రూప్ 200 కోట్ల డాలర్ల డీల్‌‌ను ఆర్‌‌‌‌ఎంజీ గ్రూప్‌‌తో కుదుర్చుకుంది. గత నాలుగేళ్ల నుంచి ఇండియాలో ఆఫీసు సెక్టార్‌‌‌‌ కంటిన్యూగా పెరుగుతోందని జేఎల్‌‌ఎల్ పేర్కొంది.

పీఎంఏవై కింద లక్షన్నరకు పైగా కొత్త ఇండ్లు..

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన(అర్బన్) కింద ప్రభుత్వం 1.68 లక్షలకు పైగా కొత్త ఇండ్లను నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. 1.1 కోటి ఇండ్లకు ఇప్పటికే ఈ స్కీమ్ కింద అనుమతులను ఇచ్చింది. మరో 70 లక్షల ఇండ్లను పలు దఫాల్లో నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ స్కీమ్ కింద 41 లక్షలకు పైగా ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది.

For More News..

ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా గుర్తించండి..

బైడెన్ రాకతో మనోళ్లకు మంచి కబురు

భర్తను చంపి అడవిలో పూడ్చిన భార్య