ప్రజాప్రతినిధుల సంస్కారం కట్టు తప్పింది

ప్రజాప్రతినిధుల సంస్కారం కట్టు తప్పింది

రెండ్రోజుల క్రితం టీవీలో మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ మాట తీరు చూసి సభ్య సమాజమే తలవంచుకుంటోంది. రాజకీయ విమర్శ, ప్రతి స్పందనల విషయంలో ప్రజాప్రతినిధులకు ఒక హద్దు, సంస్కారం అనే విషయం ఎక్కడో కట్టు తప్పింది. ఇక ‘వెంట్రుక కూడా పీకలేవు’ అనడం, ‘మాస్క్ తీసేసి మీసం మెలేయడం’ ఓ పరాకాష్టగా భావించాలి. ఇప్పుడు కేసీఆర్ కు కావలసింది ఈటల రాజేందర్​ను రెచ్చగొట్టి, రాజీనామా చేయించి, ఓడించి అడ్రస్​ లేకుండా చేయడమే. ఇందుకోసమే ఇదంతా జరుగుతోంది.

ఈటల, గంగుల వ్యవహారం మొత్తం చూస్తుంటే పాత కాలంలో రోమన్ చక్రవర్తి బానిసలను ఎరీనాలో దింపి కొట్టుకు చావండని వినోదంగా చూసే చారిత్రక సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. కొట్టుకొని చచ్చే వారు ఇద్దరూ బానిసలే. ఇవాళ తోటి బానిసను చంపిన వాడు, రేపు రాజు సంతోషం కోసం చావక తప్పదు. అయితే బతుకు మీద తీపితో సాటి బానిసతో తలపడడం తప్పని ఆనాడు అనుకోలేదు. ఈనాటికీ ఆ స్పృహ రాలేదు. బానిసల బాహాబాహీ చూసి చక్రవర్తులు నాడు నేరుగా, నేడు చాటుగా నవ్వుకుంటున్నారు.

ఉప ఎన్నిక అంత ఇంపార్టెంటా?
రాష్ట్రంలో మరే సమస్యా లేనట్లు ఉప ఎన్నికలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గతంలో ఎన్నడూ లేదు. 119 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్లే ఉండాలని అనుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది నియంతృత్వం కిందకి వస్తుంది. ఈటల రాజేందర్​ను ఆయన పని ఆయన్ని చూసుకోనివ్వండి. ఒకవేళ రాజీనామా చేసి మళ్లా గెలిస్తే తప్పేమిటి? ఆయనేమన్నా ముఖ్యమంత్రి అవుతాడా? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్ని, పాలనను ఒంటరి గొంతుతో ఎంతని ఎదుర్కోగలడు! ఆయన సొంతంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన్ని నిండు హృదయంతో అభినందించి, స్వాగతించే సంస్కారం అవసరం. దాన్నే ప్రజలు హర్షిస్తారు. ధన రాశులు కుమ్మరించి, ఆశాపాశాలతో కేడర్ ను తిప్పుకుని ఈటలను చిత్తుగా ఒడించాలని పన్నాగం రచించడం ఓ రాజకీయ క్రీడ.

ప్రత్యేక నిధులు పక్షపాతమే
అటు ఈటల, ఇటు గంగుల ఇద్దరు నేతల వాదనల్లో నువ్వు భూములు కబ్జా చేశావంటే, నువ్వు గ్రానైట్ తవ్వకాలతో కరీంనగర్ జిల్లాను బొందల గడ్డ  చేసినవని కొలుచుకోవడం దొందూదొందే అనిపించే స్థాయిలో ఉంది తప్ప ఎవరూ నిజమైన జన నాయకుడని నిరూపించుకోలేకపోయారు. ఒక్క ఉప ఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే పనులు వదిలేసి నియోజకవర్గంలో అడ్డా వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. అసలు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి ఎన్నిక ముందు సమావేశం పెట్టడం.. గెలిచాక ఆ నియోజకవర్గ ప్రజలను అభినందించడం అనేది చాలా సంకుచితమైన పని. ఇది తన హోదాను పణంగా పెట్టడమే అవుతుంది. ఉప ఎన్నిక సందర్భంగా కేవలం సదరు నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం పక్షపాత ధోరణే అవుతుంది.

సీఎం హామీలపై నమ్మకం పోయింది
ఇప్పుడు పాలకపక్షం ఆలోచన అంతా ఈటలపైనే కేంద్రీకృతమై ఉంది. ఎవరి సంతోషం కోసం తాము ఈ పని చేస్తున్నామనే స్పృహ కూడా ఎవరికీలేదు. నిన్నటిదాకా కలిసి మెలిసి తిరిగిన వారి మధ్య కొట్లాట పెట్టి ఆనందిస్తున్న రింగ్ మాస్టర్ చేతిలో అందరూ కీలు బొమ్మలైపోయారు. చివరగా టీఆర్ఎస్ పాలన పట్ల, ముఖ్యమంత్రి వాగ్దానాలు, హామీల పట్ల ఎవరికీ నమ్మకం లేకుండా పోయింది. మీడియా సమావేశాల్లో, అసెంబ్లీ సాక్షిగా పొంతన లేని హామీలిచ్చి నిలుపుకోనివి ఎన్నో ఉన్నాయి. జర్నలిస్టులకు ఇండ్లు, భూమి ఇస్తా అని మాటివ్వని ప్రెస్ మీట్ లేదు. ఇచ్చిన సందర్భమూ లేదు. దాన్ని ప్రశ్నించే సాహసం కలాలకు లేదు. పాలన ఎలా ఉన్నా ప్రజలు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా కనీసం సమాజం ముందు మన మర్యాద కాపాడేందుకు భాషా, సంస్కారం నడవడి పట్ల శ్రద్ధ చూయించి నలుగురిలో తెలంగాణ గౌరవాన్ని కాపాడితే అదే చాలు.

బీసీ పదాన్ని దయచేసి తేవొద్దు
ఇక ఇద్దరు నేతల వాగ్బాణాల విషయానికి వస్తే, గంగుల మీసం మెలేస్తూ ‘నేను బీసీని బిడ్డా’ అన్నారు. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. దయచేసి మీ సవాళ్ల నడుమ బీసీలను తేవొద్దని కోరుతున్నా. మీరు బీసీలా, ఓసీలా మాకనవసరం. బీసీ లక్షణాలు, నడవడిక కలిగినవాడే బడుగు, బలహీన వర్గాల బిడ్డ. పబ్బం గుడుపుకునేందుకు బీసీ పదాన్ని ఉచ్ఛరించే అధికారం మీకెవరికీ లేదు. బీసీ నేతగా రుజువు చేసుకుని ఆ మాట పలికే అర్హత సంపాదించుకోవాలి. బీసీ పుట్టుక పుట్టి ఓసీల పాదపూజ చేయడం అంటే బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కిందనే లెక్క. ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడిన వారి భాషకు ఆ పార్టీ పెద్దలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన ‘వాగ్భూషణమ్’ను కీర్తిస్తూ వేల కాపీలను ప్రభుత్వం తరపున ముద్రించి, భాషను శుద్ధి చేసుకోండని పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ వాళ్లు ఏం నేర్చుకున్నారో పరీక్ష పెట్టి చూసే అవసరం ఇప్పుడు వచ్చింది.

- బి.నర్సన్, పొలిటికల్​ ఎనలిస్ట్