
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొనుగోళ్లు
హైదరాబాద్ లో దిశ ఘటన తరువాత నుంచి ఆపద వస్తే తమను తాము కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా పెప్పర్ స్ప్రే కొంటున్న ఆడవాళ్ల సంఖ్య పెరిగింది. ఈ వారంలోనే అమెజాన్‌లో పెప్పర్ స్ప్రే సేల్స్ ఏకంగా 700 రెట్లు పెరిగింది. అమ్మాయిలు దీని అవసరం తమకు ఎంతగా ఉందనుకుంటున్నారో ఇది స్పష్టం చేస్తోంది.
ఆపదలో ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడం ఎంతమంది ఆడవాళ్లకు వచ్చు?
హైదరాబాద్ దిశ ఘటన జరిగినప్పట్నించీ ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా ఎంతోమందిని వెంటాడి, వేధిస్తోంది. అత్యాచారం చేస్తే కఠినమైన శిక్షలు పడాలని అందరూ రోడ్డు మీదికి వచ్చి ర్యాలీలు చేసి మరీ నినాదాలు చేస్తున్నారు. ఏదైనా ఆపద వస్తే మనల్నిమనం కాపాడుకోవాలి కదా అని అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ కోచింగ్ క్లాసుల్లో చేరుతున్నారు. మన రాష్ర్టంలో, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోచింగ్ వెళ్తున్న అమ్మాయిల, ఆడవాళ్ల సంఖ్య పెరిగింది. వీటితో పాటు పెప్పర్ స్ప్రేలు కొంటున్న వాళ్ల సంఖ్యా బాగానే పెరిగింది. అందుకు నిదర్శనం అమెజాన్ సేల్స్. ఈ వారం రోజుల్లోనే అమెజాన్‌లో పెప్పర్ స్ప్రే సేల్స్ 700 శాతం పెరిగిందంటే… అమ్మాయిలు దీని అవసరాన్ని ఎంత ఉందనుకుంటున్నారో అర్థంచేసుకోవచ్చు. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ‘సెక్యూరిటీ అండ్ సేఫ్టీ’ సెక్షన్ ‘పెప్పర్ స్ప్రే’ బెస్ట్ సెల్లర్. ఒక్కసారిగా దీనికి డిమాండ్ పెరగడంతో ‘కోబ్రా’ లాంటి టాప్ పెప్పర్ స్ప్రే బ్రాండ్ ‘అవుటాఫ్ స్టాక్’ బోర్డు పెట్టాల్సి వచ్చింది. ఎవరైనా దాడికి ప్రయత్నించినప్పుడు వాళ్ల కళ్లలో పెప్పర్ స్ప్రే కొడితే… వాళ్లు కోలుకునేలోపు తప్పించుకునే అవకాశం ఉంటుంది. దిశ లాంటి ఘటనలు జరిగాయని తెలిసినప్పుడల్లా ‘పెప్పర్ స్ప్రే ఒకటి బ్యాగులో పెట్టుకుంటే ఆపదలో పనికొస్తుంది కదా?’ అన్న సలహాలెన్నో ఇస్తుంటారు అమ్మాయిలకు. అసలు అలాంటి ఆపదే రాని రోజు ఒకటి వస్తే ఎంత బాగుంటుందో కదా! హోప్ ఫర్ దట్.