
డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది డయాబెటిస్ బారిన పడుతున్న సందర్భంలో వారికి ఓ కొత్త చికిత్సా విధానం అందుబాటులోకి వస్తోంది. రోగి శరీరం నుంచే తీయబడిన కణాలతో డయాబెటిస్ కు చెక్ పెట్టేందుకు పరిశోధనలు ఫైనల్ దశలో ఉన్నాయి.
డయాబెటిస్కు కొత్త చికిత్సలో మరో ముందడుగు పడింది. కొత్త చికిత్స అందుబాటులోకి రానుంది.డయాబెటిస్ కు చెక్ పెట్టేందుకు స్టెమ్ సెల్ థెరపీ అనే కొత్త చికిత్సా విధానం వస్తోంది. ఇది డయాబెటిస్ వల్ల దెబ్బతిన్న కణజాలాలను మరమ్మత్తు చేయడం, లేదా కొత్త కణాలను ఉత్పత్తి చేసేందుకు స్టెమ్ సెల్స్(మూల కణాలు)ను ఉపయోగించి చికిత్స చేస్తున్నారు. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ రెండింటికీ శాశ్వత పరిష్కార మార్గం లభిస్తుందంటున్నారు. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ బీటా కణాలను భర్తీ చేయడం లేదా వాటి పనితీరును మెరుగుపర్చడం ద్వారా డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చంటున్నారు.
ఇన్సులిన్-ఉత్పత్తి చేసే కణాల పునరుత్పత్తి ..
భ్రూణ స్టెమ్ కణాలు (Embryonic Stem Cells - ESCs): ఇవి శరీరంలోని ఏ రకమైన కణాలుగానైనా మారగలవు. పరిశోధకులు ESCలను ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలుగా మార్చి, వాటిని డయాబెటిస్ రోగులలోకి మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
ప్రేరేపిత ప్లూరిపోటెంట్ స్టెమ్ కణాలు సాధారణ శరీర కణాల నుండి ల్యాబ్‌లో సృష్టించబడిన స్టెమ్ కణాలు. ESCల మాదిరిగానే iPSCలను బీటా కణాలుగా మార్చి వాటిని రోగులలోకి మార్పిడి చేయవచ్చు. దీని వల్ల ఇవి రోగి సొంత కణాల నుంచి వస్తాయి కాబట్టి తిరస్కరణ ప్రమాదం తక్కువ.
మెసెన్కైమల్ స్టెమ్ కణాలు ఎముక మజ్జ (bone marrow), బొడ్డుతాడు (umbilical cord), కొవ్వు కణజాలం (adipose tissue) వంటి ప్రదేశాలలో లభిస్తాయి. MSCలు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలుగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించగలవు. టైప్ 1 డయాబెటిస్‌లో శరీరం తన బీటా కణాలపై దాడి చేస్తుంది కాబట్టి MSCలు రోగనిరోధక దాడిని తగ్గించి, మిగిలిన బీటా కణాలను రక్షించడంలో ఇవి సహాయపడతాయి.
రోగనిరోధక వ్యవస్థను మోడ్యులేట్ చేయడం
టైప్ 1 డయాబెటిస్ ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇక్కడ రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. స్టెమ్ సెల్ థెరపీ ముఖ్యంగా MSCల వాడకం ద్వారా ఈ రోగనిరోధక ప్రతిస్పందనను అణచివేస్తుంది.తద్వారా మిగిలిన బీటా కణాలను రక్షిస్తుంది. కొత్తగా ఏర్పడిన కణాలను తిరస్కరించకుండా నిరోధించవచ్చు.
ప్రస్తుత పరిశోధనలు భవిష్యత్తు
స్టెమ్ సెల్ థెరపీ డయాబెటిస్ చికిత్సలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. అనేక క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి ..కొన్ని ఆశాజనకమైన ఫలితాలను చూపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో స్టెమ్ సెల్ థెరపీ పొందిన టైప్ 1 డయాబెటిస్ రోగులు ఇన్సులిన్ అవసరం లేకుండా ఉన్నారు. టైప్ 2 డయాబెటిస్ రోగులలో రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగుపడటం, మందుల అవసరం తగ్గింది.
కొన్ని పరిశోధనలు స్టెమ్ సెల్స్ నుంచి ఉత్పత్తి చేయబడిన ఐలెట్ కణజాలాన్ని రోగులకు మార్పిడి చేయడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని స్థిరంగా చేయగలిగారు. అయితే స్టెమ్ సెల్ థెరపీ ఇంకా ప్రయోగాత్మక దశలో ఉంది.