పీవోహెచ్ పనులు షురూ

పీవోహెచ్ పనులు షురూ

హనుమకొండ, కాజీపేట, వెలుగు: కాజీపేటలో పీవోహెచ్(పీరియాడికల్ ఓవర్ హాలింగ్) వర్క్ షాప్ పనులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు 160 ఎకరాలకు పైగా స్థలం అవసరం కాగా.. అయోధ్యపురంలోని మడికొండ సీతారామచంద్ర స్వామి ఆలయ భూముల్లో 150.5 ఎకరాల స్థలాన్ని అప్పగిస్తూ  దానికి సంబంధించిన డాక్యుమెంట్స్  2021 జనవరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు చేతుల మీదుగా రైల్వే ఆఫీసర్లకు అందజేశారు. కానీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న ల్యాండ్ కు అవసరమైన బాట స్థలం 1.17 గుంటలు ప్రైవేటు వ్యక్తికి చెందిన భూమి కాగా.. ఆ భూమిని కూడా సేకరించి ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించి మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. కానీ రెండేండ్లు దాటినా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి సేకరించి, రైల్వేకు అప్పగించడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టుకు ముందడుగు పడలేదు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోయినా కేంద్రం తన పని తాను చేసుకుపోయింది. ఇందులో భాగంగానే ఆర్నేళ్ల కింద రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది.  హైదరాబాద్ కు చెందిన పవర్ మెక్ టైకిషా జాయింట్ వెంచర్ అనే సంస్థ పనులు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్ లో  రూ.160 కోట్లు మంజూరు చేసింది. అనంతరం మరోవైపు నుంచి బాట ఏర్పాటు చేసుకుని నాలుగు రోజుల కింద పనులు స్టార్ట్ చేసింది.  ఈ మధ్యకాలంలోనే ప్రధాని చేతుల మీదుగా పీవో హెచ్ కు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని బీజేపీ లీడర్లు చెప్తున్నారు.