సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ, అంగన్వాడీలకు పక్కా భవనాలు ..54 చొప్పున మంజూరు

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ, అంగన్వాడీలకు పక్కా భవనాలు ..54 చొప్పున మంజూరు
  • ఉపాధి హామీ కింద శాశ్వత పనులు
  • స్థల సేకరణపై అధికారుల కసరత్తు
  • 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో  సొంత భవనాలు లేని పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలకు పర్మినెంట్ బిల్డింగుల నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 54 గ్రామ పంచాయతీలు, 54 అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించనున్నారు. ఉపాధి హామీ కింద కూలీలకు పని కల్పిస్తూ మెటీరియల్  కాంపోనెంట్ ద్వారా భవనాలను నిర్మించనున్నారు. వీటికి సంబంధించి అధికారులు రెండు నెలల కింద ప్రభుత్వానికి నివేదికలు అందజేయగా వాటి నిర్మాణాలకు ఫండ్స్ శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం కలెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 27 మండలాల వారీగా ఒక్కో మండలానికి రెండేసి పక్కా భవనాల నిర్మాణాలు జరగనున్నాయి.  

జిల్లాలో ఇలా..

జిల్లాలో 631 పంచాయతీలు ఉండగా 412 జీపీలకు సొంత భవనాలున్నాయి. మిగిలిన 219 పంచాయతీలకు శాశ్వత బిల్డింగులు లేవు. సొంత భవనాలు లేని చోట్ల గవర్నమెంట్ స్కూళ్లు, చావిడీలు, కమ్యూనిటీ బిల్డింగులు, చెట్ల కింద పాలన కొనసాగుతోంది.  5 అంగన్వాడీ ప్రాజెక్టుల కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,504 కేంద్రాలు ఉండగా వాటిలో 509 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 528 కేంద్రాలు అద్దె బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. మిగతా 466 అంగన్వాడీ కేంద్రాలు ఉచిత బిల్డింగులలో నడుస్తున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఆయా కొత్త బిల్డింగుల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కొన్నిచోట్ల గుర్తించగా మరి కొన్ని చోట్ల స్థలాల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

పంచాయతీకి రూ.20 లక్షలు

గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కొత్త బిల్డింగుల నిర్మాణానికి ప్రభుత్వం ఫండ్స్ మంజూరు చేసింది. ఒక్కో పంచాయతీ బిల్డింగ్ కు రూ.20 లక్షలు ఖర్చు చేయనుండగా, ఒక్కో అంగన్వాడీ బిల్డింగ్ కు ఉపాధి నిధులు రూ.8 లక్షలు, 15వ ఆర్థిక సంఘం కింద రూ.2లక్షలు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.12 లక్షలు వెచ్చించనున్నారు. ఈ నెలాఖరులోగా కొత్త భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి 2026 మార్చి నాటికి అన్ని బిల్డింగులు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.

యూనిక్ మోడల్ గా.. 

జిల్లాలో కొత్తగా నిర్మించే పంచాయతీ, అంగన్వాడీ బిల్డింగులు యూనిక్ మోడల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ శాఖ మంత్రి సీతక్క స్పెషల్ ఫోకస్ పెట్టి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటిని ప్రజలు చూడగానే పంచాయతీ.. అంగన్వాడీ బిల్డింగ్ అని గుర్తించేలా డిజైన్ చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు గత నవంబర్ లోనే లక్ష్యం నిర్దేశించుకోగా స్థలాల సేకరణ, కేటాయింపులో జరిగిన ఆలస్యం కారణంగా కొత్త బిల్డింగుల నిర్మాణాలు జరగలేదు. ప్రస్తుతం  మంత్రి ఆదేశాలతో కొత్త భవనాల ఎంపిక తో పాటు నిర్మాణాల విషయంలో జిల్లా యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తోంది.