బెజ్జూర్ నుంచి మధ్యప్రదేశ్ కు అమ్మాయిల అక్రమ రవాణా

బెజ్జూర్ నుంచి మధ్యప్రదేశ్ కు అమ్మాయిల అక్రమ రవాణా
  •     మిస్సింగ్ కేసు విచారణతో వెలుగులోకి..
  •     పలువురిని విచారిస్తున్న పోలీసులు

కాగజ్‌‌‌‌నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో ఇద్దరు యువతుల అదృశ్యం కేసులో అక్రమ రవాణా కోణం వెలుగులోకి వచ్చింది. ఏడు నెలల క్రితం బెజ్జూర్ మండలానికి చెందిన ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌‌‌‌లో ఉన్న వారిని గుర్తించి సురక్షితంగా తిరిగి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు యువతులను ఇతర రాష్ట్రాలకు అమ్మిన ముఠా కార్యకలాపాలను గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అమాయక యువతులను మోసం చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనలో ప్రధాన నిందితులతో పాటు సహకరించిన మరో నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కౌటాల సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఇద్దరు యువతుల మిస్సింగ్ కేసును నమోదు చేసి విచారణలో భాగంగా వారిని కాపాడి కుటుంబాలకు అప్పగించామని, ప్రస్తుతం మహిళల అక్రమ రవాణా కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.