
హైదరాబాద్, వెలుగు: టీఎస్ బీపాస్ చట్టం కింద ఇండ్ల నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లోగా వాటిని ఆఫీసర్లు ధ్రువీకరణ చేయాల్సి ఉంటుందని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని వెల్లడించింది. 75 గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలోని స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలంటే స్థానిక సంస్థ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.75 చదరపు గజాలలోపు స్థలానికి కూడా అనుమతులు అవసరమేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఫీజు రాయితీ కల్పిస్తోందని, రూ.1 చెల్లించి అనుమతులకు ధ్రువీకరణ పొందాలని తెలిపింది. అయితే, నిర్మాణం అయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదని చెప్పింది.
ఓ వ్యక్తి, అతడి కొడుకు 80 గజాల ప్లాట్ ను చెరిసగం చొప్పున విభజన చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక టీఎస్ బీపాస్ కింద నిర్మాణాలకు అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. దీనిపై చుట్టుపక్కల వాళ్ల ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇవ్వడంతో వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. మల్కాజిగిరి, వినాయక్‌నగర్‌కు చెందిన ఎం. దినేష్ కుమార్ జైన్, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ మేరకు శుక్రవారం జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పొరుగువాళ్ల ఫిర్యాదుతో నిర్మాణాలను నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ నోటీసు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్‌ల లాయర్ వాదించారు. దీనిపై జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బీపాస్ లో దరఖాస్తు చేసుకున్నాక 21 రోజుల్లోగా అధికారులు పత్రాలను పరిశీలించి ధ్రువీకరించాలని, కానీ ఆ గడువుకు ముందే నిర్మాణం చేపట్టారన్నారు. దీంతో నోటీసులకు పిటిషనర్ల వివరణను పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం నిర్ణయాన్ని తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది.