పోలీస్​ అనుమతి​లేదన్న ఆర్ట్స్​కాలేజ్​ ప్రిన్సిపల్

పోలీస్​ అనుమతి​లేదన్న ఆర్ట్స్​కాలేజ్​ ప్రిన్సిపల్
  • బీజేపీ సభకు పర్మిషన్​ క్యాన్సిల్
  • పోలీస్​ అనుమతి​లేదన్న ఆర్ట్స్​కాలేజ్​ ప్రిన్సిపల్
  • బీజేపీ నేతలు ఇప్పటికే అనుమతి కోరినా.. స్పందించని పోలీసులు 
  • హనుమకొండ ఏసీపీ ఆఫీసు ముందు బీజేపీ లీడర్ల నిరసన

హనుమకొండ/హైదరాబాద్, వెలుగు: హనుమకొండ ఆర్ట్స్​కాలేజీలో నిర్వహించ తలపెట్టిన బీజేపీ బహిరంగ సభకు పోలీస్ ​పర్మిషన్​లేదనే కారణంతో కాలేజ్ ​ప్రిన్సిపల్​ బన్నా అయిలయ్య అనుమతి నిరాకరించారు. గురువారం రాత్రి 8గంటల తర్వాత బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కు సభకు అనుమతి నిరాకరిస్తూ లేఖ పంపారు. సభా స్థలి కోసం కట్టిన రూ.5లక్షల చెక్కును వాపసు చేస్తామని పేర్కొన్నారు. 27న ఆర్ట్స్​కాలేజీలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతివ్వాలని కోరుతూ బీజేపీ జిల్లా నాయకులు 23న మంగళవారం వరంగల్ సీపీ తరుణ్ జోషిని కలిశారు. హనుమకొండ ఏసీపీని కలవాల్సిందిగా సీపీ సూచించారు. పోలీసుల అనుమతి కోసం బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే పోలీసు పర్మిషన్ లెటర్ లేదంటూ ఆర్ట్స్ కాలేజ్​ ప్రిన్సిపల్ సభకు అనుమతి నిరాకరించారు. 

ఏసీపీ ఆఫీసు ముందు నిరసన 

సభకు అనుమతి నిరాకరించారన్న విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు హనుమకొండ ఏసీపీ ఆఫీసుకు చేరుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఇన్​చార్జి మురళీధర్ గౌడ్ ,చాడ శ్రీనివాసరెడ్డి, రావుల కిషన్​ఆఫీస్ ​ముందు నిరసన తెలిపారు. తాము ఇచ్చిన దరఖాస్తు నుపరిశీలించకుండా జాప్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 

దమ్ముంటే అడ్డుకోండి: గంగిడి మనోహర్ రెడ్డి 

27న సభ నిర్వహించి తీరుతామని, దమ్ముంటే అడ్డుకోవాలని పాదయాత్ర ఇన్​చార్జి గంగిడి మనోహర్​రెడ్డి స్పష్టం చేశారు. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక, ప్రిన్సిపల్ పై సర్కారు ఒత్తిడి చేయడంతో, అనుమతి రద్దు చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఆయన గురువారం రాత్రి శివునిపల్లిలో మీడియాతో మాట్లాడారు. 23న ప్రిన్సిపాల్​ను కలిసి పర్మీషన్​ తీసుకున్నామని చెప్పారు. రూ.5 లక్షలు కూడా చెల్లించామనీ, పార్కింగ్ కోసం మరో 3గ్రౌండ్​లను ఎంపిక చేసి డబ్బు చెల్లించామన్నారు. కేసీఆర్ అవినీతిని, కేసీఆర్ కూతురు కుంభకోణాన్ని బీజేపీ బట్టబయలు చేస్తుందనే అక్కసుతో సభను అడ్డుకుంటున్నారన్నారు. సభ నిర్వహణ కోసం కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.