సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భారీ మంచులో యజమాని చనిపోతే అతడి పెంపుడు కుక్క.. గడ్డకట్టే చలిలో నీరు, ఆహారం, నిద్ర లేకుండా ఏకంగా 4 రోజులు మృతదేహాన్ని కాపలా కాసింది. అత్యంత కఠినమైన వాతావరణంలోనూ తన యజమాని పట్ల పెంపుడు కుక్క చూపిన విశ్వాసం అందరినీ కంటతడి పెట్టిస్తున్నది.
విక్షిత్ రాణా, పియూశ్ అనే ఇద్దరు యువకులు తమ పెంపుడు కుక్క పిట్బుల్తో కలిసి భార్మౌర్‌లోని భార్మణి ఆలయానికి వెళ్లారు. గుడి ఏరియాలోనే కనిపించకుండా పోయారు. గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలకు నాలుగు రోజుల తర్వాత హృదయాన్ని కదిలించే దృశ్యం కనిపించింది.మంచులో పూడుకుపోయి ఉన్న పియూశ్ డెడ్‌బాడీ వద్ద అతని పెంపుడు కుక్క పిట్‌బుల్ కాపలాగా నిలబడి ఉంది.
గడ్డకట్టే చలిలో నాలుగురోజులపాటూ తిండి, నీళ్లు, నిద్ర లేకుండా ఇతర జంతువుల నుంచి రక్షణగా కాపలా కాసింది. రెస్క్యూ సిబ్బందిని కూడా అది తన యజమాని డెడ్‌బాడీ వద్దకు రానివ్వలేదు. ఈ దృశ్యం చూసి రెస్క్యూ సిబ్బంది చలించిపోయారు. వారు కుక్కను సున్నితంగా హ్యాండిల్ చేసి శాంతపరిచారు. అనంతరం ఇద్దరి మృతదేహాలతో పాటు కుక్కను అక్కడి నుంచి తరలించారు.
