10 బిల్లులకు ఓకే చెప్తలేరని రాష్ట్ర సర్కారు పిటిషన్​

10 బిల్లులకు ఓకే చెప్తలేరని రాష్ట్ర సర్కారు పిటిషన్​
  • ప్రభుత్వానికి లోబడే గవర్నర్​ పని చెయ్యాలని ప్రస్తావన
  • హోలీ సెలవుల తర్వాత విచారించనున్న కోర్టు!

న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్​ తమిళిసైపై రాష్ట్ర సర్కార్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆమె అడ్డుకుంటున్నారని, వాటిని ఆమోదించడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట గురువారం  194 పేజీల పిటిషన్​ను ఫైల్​ చేసింది. గవర్నర్​ సెక్రటరీ, కేంద్ర లా సెక్రటరీని ప్రతివాదులుగా చేర్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 32 ప్రకారం పిటిషన్​ను ఫైల్​ చేస్తున్నట్లు తెలిపింది. ‘‘ఆర్టికల్​ 200 ప్రకారం గవర్నర్​ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఆర్టికల్​163 ప్రకారం సీఎం నేతృత్వంలోని మంత్రి మండలి, రాష్ట్ర సర్కారు సలహాలు, సూచనలకు లోబడే గవర్నర్​ పనిచేయాల్సి ఉంటుంది’’ అని పిటిషన్​లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.  

సెప్టెంబర్​లో 7, ఫిబ్రవరిలో 3 బిల్లులు..

అసెంబ్లీ 8వ సెషన్​లోని 4, 5 సమావేశాల్లో మొత్తం 10 బిల్లులను ఆమోదించినట్టు పిటిషన్​లో రాష్ట్ర సర్కారు వివరించింది. 2022 సెప్టెంబర్​ 12న 7 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలుపగా.. 13వ తేదీన గవర్నర్​ ఆమోదానికి పంపినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో మూడు బిల్లులపై చర్చ నిర్వహించి 12న అసెంబ్లీ ఓకే చెప్పిందని, ఆ మర్నాడే గవర్నర్​ వద్దకు ఫైళ్లను పంపించామని తెలిపింది. కానీ, గవర్నర్​ మాత్రం సరైన వివరాలేవీ చెప్పకుండా,   ఆ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్​లో పెట్టారని పిటిషన్​లో ప్రభుత్వం పేర్కొంది.  బిల్లుల్లో ఏవైనా తప్పులుంటే ప్రభుత్వానికి సూచనలు చేయాలని, తద్వారా అసెంబ్లీలో దానిపై చర్చించి బిల్లుల్లో సవరణలపై పున:పరిశీలించడానికి వీలుంటుందని తెలిపింది. గవర్నర్ ​తమిళిసై మాత్రం ఆ విషయాలేవీ ప్రభుత్వానికి చెప్పడం లేదని, కారణాల్లేకుండా బిల్లులను పెండింగ్​లో పెడుతున్నారని ఆక్షేపించింది. సంబంధిత మంత్రులు గవర్నర్​ను కలిసి వివరణ ఇచ్చినా.. చేస్తామని చెప్పారే తప్ప ఆమోదించలేదని ప్రభుత్వం పేర్కొంది. బిల్లుల పెండింగ్​, ఆమోదం, గవర్నర్​ అధికారాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల కాపీని పిటిషన్​కు జత చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్​ అధికారాలపై రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్​ను వివరించింది. ‘‘రాజ్యాంగం, చట్టం ప్రకారం గవర్నర్​ తన విధులను నిర్వర్తించేలా రాజ్యాంగంలో తప్పనిసరి చేయాలి. ప్రభుత్వానికి లోబడి పనిచేసేలా క్లాజులు, ప్రొవిజన్లలో పలు మార్పులు చేయాలి. గవర్నర్​ను ఎన్నుకుంటే సీఎంకు సమాంతర వ్యవస్థగా గవర్నర్​ వ్యవస్థ మారే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రెసిడెంట్​ ద్వారానే గవర్నర్లను నామినేట్​ చేయించాలి’’ అని ఆర్టికల్​ 130పై కొన్నేండ్ల కింద చర్చ జరిగిందని పిటిషన్​లో ప్రభుత్వం తెలిపింది. హోలీ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నెల 11న కోర్టు తెరుచుకోనుంది. దీంతో హోలీ సెలవుల తర్వాతే రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్​పై విచారణ జరిగే అవకాశం ఉంది.
అంతా సెట్​ అయిందనుకుంటుండగానే..!
కొన్నాళ్లుగా రాష్ట్రంలో రాజ్​భవన్​కు, ప్రగతిభవన్​కు మధ్య గ్యాప్​ పెరిగింది. గవర్నర్​కు ప్రభుత్వం నుంచి ప్రొటోకాల్​ దక్కకపోవడం, ఆమె నిర్వహించే ప్రోగ్రామ్​లకు ప్రభుత్వ పెద్దలు హాజరుకాకపోవడం వంటివి చర్చకు దారితీశాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా గవర్నర్​ స్పీచ్​ లేకుండానే ప్రభుత్వం చేపట్టింది. ఇటీవల రిపబ్లిక్​ డే వేడుకలను నామమాత్రంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నించగా.. హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బడ్జెట్​ ఫైల్​కు గవర్నర్​ ఓకే చెప్పడం లేదంటూ గత నెల రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్​ వేసి.. చివరికి  గవర్నర్​ స్పీచ్​తోనే  అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పాల్సి వచ్చింది. దీంతో అంతా సెట్​ రైట్​ అయిందనుకుంటుండగానే.. ఇప్పుడు గవర్నర్​పై  సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడం గమనార్హం.

గవర్నర్​ ఆమోదించడం లేదని సర్కారు తెలిపిన బిల్లులివే..!

  •  ఆజామాబాద్​ ఇండస్ట్రియల్​ ఏరియా చట్ట సవరణ బిల్లు
  •     తెలంగాణ మున్సిపల్​ చట్ట సవరణ బిల్లు 
  •     తెలంగాణ పబ్లిక్​ ఎంప్లాయిమెంట్​ సవరణ బిల్లు 
  •     తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
  •     ద యూనివర్సిటీస్​ ఆఫ్​ ఫారెస్ట్రీ  తెలంగాణ బిల్లు
  •     తెలంగాణ మోటార్​ వెహికల్‌ ట్యాక్సేషన్​ చట్ట సవరణ బిల్లు 
  •     తెలంగాణ స్టేట్​ ప్రైవేట్​ యూనివర్సిటీస్​(ఎస్టాబ్లిష్మెంట్​ అండ్​ రెగ్యులేషన్​) అమెండ్​మెంట్​ బిల్లు
  •     ప్రొఫెసర్​ జయశంకర్​ తెలంగాణ స్టేట్​అగ్రికల్చర్​ యూనివర్సిటీ అమెండ్​మెంట్​ బిల్లు
  •     తెలంగాణ పంచాయతీ రాజ్​ చట్ట సవరణ తెలంగాణ మున్సిపల్​ చట్ట సవరణ-2