పెట్రోల్ సరఫరా నార్మల్...ఒక్కరోజే 17 లక్షల లీటర్ల పెట్రోల్, 13 లక్షల లీటర్ల డీజిల్ సరఫరా చేసిన హెచ్ పీ

పెట్రోల్ సరఫరా నార్మల్...ఒక్కరోజే 17 లక్షల లీటర్ల పెట్రోల్, 13 లక్షల లీటర్ల డీజిల్ సరఫరా చేసిన హెచ్ పీ
  •     అదే బాటలో మిగిలిన కంపెనీలు
  •     కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వం యాక్షన్
  •     డబ్బులు కట్టకపోవడంతో కొన్ని బంకులకు నో డెలివరీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: మహానగరంలో పెట్రోల్, డీజిల్​ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంది. ​వార్​ఎఫెక్ట్, ప్రధాని మోదీ ప్రకటనతో పెట్రో ఉత్పత్తులు దొరకవేమోననే భయంతో గత మూడు రోజులుగా సిటీలోని పెట్రోల్​బంకుల​వద్ద వాహనాలు బారులు తీరిన సంగతి తెలిసిందే. దీంతో ఏ బంకు చూసినా రద్దీతో కనిపించింది. ఆందోళనకర పరిస్థితులను​చూసిన ప్రభుత్వం.. పెట్రో కొరత లేదని, ఫుల్లుగా స్టాక్​ఉందని ప్రకటిచడంతో పాటు అధికారులను రంగంలోకి దింపింది.

సివిల్​సప్లయీస్​అధికారులు ప్రతి బంకులో స్టాక్​చెక్​చేసి కృత్రిమ కొరత సృష్టించకుండా యాక్షన్​తీసుకున్నారు. సిటీ సీపీ సజ్జనార్, కలెక్టర్​హరిచందన కూడా ప్రెస్​మీట్​పెట్టి పెట్రోల్, డీజిల్​పుష్కలంగా ఉందని ప్రకటించారు. ఖుల్లా పెట్రోల్​తీసుకెళ్లి బ్లాక్​చేసే అవకాశం ఉండడంతో అమ్మితే జైల్లో వేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గురువారం పరిస్థితి అదుపులోకి వచ్చింది. చాలా బంకుల్లో క్యూలైన్లు కనిపించలేదు.  

కోరినంత ఇంధనం సరఫరా..

షరతులకు లోబడి డీలర్లు ముందస్తు చెల్లింపులు చేస్తుండడంతో కంపెనీలు డిమాండ్​కు అనుగుణంగా సరఫరా చేస్తున్నాయి. డీలర్లకు ఒక్క హిందూస్తాన్ పెట్రోలియం(హెచ్ పీ) నుంచే గురువారం17 లక్షల లీటర్ల పెట్రోల్, 13 లక్షల లీటర్ల డీజిల్​సరఫరా జరిగింది. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్​కార్పొరేషన్​వంటి కంపెనీలు కూడా డీలర్లు కోరినంత ఇంధనం​సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. గల్ఫ్​యుద్ధం ముగిసేవరకు ముందస్తు చెల్లింపులు చేస్తేనే పెట్రోల్, డీజిల్​సరఫరా చేస్తామని ఆయిల్​కంపెనీలు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు డీలర్లు కూడా అంగీకరించారు.

పెట్రో సప్లయ్​ భారీగా పెంచాం: స్టీఫెన్ రవీంద్ర

ప్రభుత్వం ఇంధన సరఫరాను రెగ్యులర్ స్థాయికంటే భారీగా పెంచిందని సివిల్​ సప్లయ్స్ కమిషనర్​ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాలోనూ ఎలాంటి అంతరాయం లేదన్నారు. కాగా, రాష్ట్రంలో పెట్రోల్‌ రోజుకు సగటున 5,883 కిలోలీటర్లు అవసరం కాగా,10,799.5 కిలోలీటర్లు సరఫరా చేశారు. డీజిల్‌ సగటున 7,348 కిలోలీటర్లు కాగా, 11,327.5 కిలోలీటర్లు అందించారు. రోజుకు 2,15,151 ఎల్‌పీజీ సిలిండర్లు అవసరం ఉంటే 2,19,980 సిలిండర్లు పంపిణీ చేశారు. 

ఒక్క క్లిక్ తో  పెట్రోల్ స్టాక్ వివరాలు

నగరంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంకా నో స్టాక్​ బోర్డులు, పలుచోట్ల రద్దీ కనిపిస్తోంది. ఈ మేరకు  ఆయా సంస్థల వెబ్‌సైట్లలో ఏరియాలోని పెట్రోల్ బంక్ ఫోన్ నంబర్, స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చు. ఐఓసీఎల్​అయితే https://locator.iocl.com/location/telangana/hyderabad,  హెచ్​పీసీఎల్ https://petrolpump.hpretail.in/location/telangana/hyderabad,  బీపీసీఎల్ కోసం https://www.bharatpetroleum.in వెబ్​సైట్​లోకి వెళ్లి నిల్వలపై వివరాలు తెలుసుకోవచ్చు.