మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 18 రోజుల తరువాత మంగళవారం దేశమంతటా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచాయి.  ఢిల్లీలో పెట్రోలుపై 15 పైసలు పెంచడంతో దీనిరేటు రూ.90.40 నుండి లీటరుకు రూ. 90.55లకు చేరింది. డీజిల్ ధరల 18 పైసలు పెరిగి లీటరుకు. 80.73 నుండి రూ. 80.91 కు పెరిగింది. చివరిసారిగా గత నెల 15 న పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా 16 పైసలు, 14 పైసలు తగ్గించారు. ఈ ఏడాది మార్చి 24 నుంచి మంగళవారం వరకు పెట్రోల్,  డీజిల్ రేట్లు లీటరుకు 77 పైసలు  లీటరుకు 74 పైసలు తగ్గాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 23 వరకు వీటి రేట్లు లీటరుకు వరుసగా రూ. 7.46, రూ. 7.60 పెరిగాయి. మన దేశంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం,  హిందూస్తాన్ పెట్రోలియం  రోజూ ఉదయం 6 గంటలకు ధరలను మార్చుతాయి. వ్యాట్ కారణంగా పెట్రో రేట్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. హైదరాబాద్‌‌లో లీటరు పెట్రోల్ ధర రూ.94.16గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.88.25గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.90.55, డీజిల్ ధర రూ.80.91గా ఉంది.