- ఏటా నాన్ లోకల్స్‌కు పోతున్న
- ఎండీ/ఎంఎస్, ఎండీఎస్ సీట్లు
- స్థానిక విద్యార్థులకే పీజీ సీట్లు దక్కేలా సీఎం రేవంత్ నిర్ణయం
- మంత్రి దామోదర విజ్ఞప్తికి ఓకే చెప్పిన ముఖ్యమంత్రి
- నేడో, రేపో జీవో విడుదల.. ఈ అకడమిక్ ఇయర్ నుంచే అమలు
పీజీ మెడికల్ అడ్మిషన్లలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న నష్టానికి రాష్ట్ర సర్కార్ చెక్ పెట్టింది. ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా (ఎంక్యూ-1) సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం ఈ కీలక ఫైల్ పై ఆమోదముద్ర వేశారు. ఇప్పటిదాకా ఈ సీట్లన్నీ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఉండటంతో మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏటా 318 పీజీ మెడికల్, 70 పీజీ డెంటల్ సీట్లు ఇకపై తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక జీవోను వెంటనే జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని సీఎం ఆదేశించారు. ఈ జీవో నేడో, రేపో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
బీ కేటగిరీలో 85 శాతం మనకే
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం సీట్లలో 25 శాతం మేనేజ్‌మెంట్ కోటా కింద, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద, ఇనిస్టిట్యూషన్ ప్రయారిటీ కింద మరో 10 శాతం సీట్లను భర్తీ చేస్తారు. మేనేజ్‌మెంట్ కోటాను బీ కేటగిరీగా, ఎన్ఆర్ఐ కోటా సీ కేటగిరీగా పిలుస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీ కేటగిరీలోని సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే చెందుతాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 12 ప్రభుత్వ కాలేజీల్లో 1,472 పీజీ సీట్లు, 19 ప్రైవేట్ కాలేజీల్లో 1,511 పీజీ సీట్లు.. మొత్తంగా 2,983 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా (ఎంక్యూ) కింద 741 సీట్లు ఉంటే, అందులో ఎంక్యూ1 కేటగిరీలో 374 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఈ 374 సీట్లలో 85 శాతం అంటే 318 సీట్లు ఇకపై తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం అంటే 56 సీట్లు మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. ఇదే విధానంలో పీజీ డెంటల్ (ఎండీఎస్) సీట్లలో కూడా ఏటా 70 సీట్లు మన విద్యార్థులకే దక్కనున్నాయి.
పదేండ్లలో పట్టించుకోని బీఆర్ఎస్
రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడుస్తున్నా.. పీజీ మెడికల్ మేనేజ్‌మెంట్ కోటాలో పాత విధానమే కొనసాగుతున్నది. ఇక్కడి ప్రైవేట్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లను వంద శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయడంతో దేశవ్యాప్తంగా మంచి ర్యాంకులు సాధించిన నాన్-లోకల్ విద్యార్థులు ఇక్కడ సులువుగా సీట్లు దక్కించుకుంటున్నారు.
మన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినా, కొద్ది మార్కుల తేడాతో సీట్లు కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు. బీ కేటగిరీలో దాదాపు 60 శాతం సీట్లను ఏటా ఇతర రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకుంటున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఏపీతో సహా చాలా రాష్ట్రాలు ఎప్పుడో 85 శాతం లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నా, మన దగ్గర మాత్రం గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. దీంతో మేనేజ్‌మెంట్ సీట్ల కోసం ఇతర రాష్ట్రాల విద్యార్థులతో మన విద్యార్థులు పోటీ పడలేకపోయేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మన రాష్ట్ర విద్యార్థులకే 85 శాతం సీట్లు దక్కనున్నాయి.
మంత్రి దామోదర విజ్ఞప్తి.. ఓకే చెప్పిన సీఎం
తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (టీ జూడా) సహా పలు వైద్య సంఘాలు స్థానిక విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఏండ్లుగా పోరాడుతున్నాయి. ఈ సమస్య తీవ్రతను, విద్యార్థుల ఆవేదనను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా దృష్టికి సంఘాల నాయకులు పలుమార్లు తీసుకెళ్లారు. తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే విషయాన్ని సీఎం దృష్టికి మంత్రి దామోదర తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం, విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేసేలా చారిత్రక నిర్ణయం తీసుకుని ఫైల్‌పై సంతకం చేశారు. ఇకపై మేనేజ్‌మెంట్ కోటా (ఎంక్యూ-1)లోని 85 శాతం సీట్లు మనోళ్లకే రిజర్వ్ అవుతాయి. మిగిలిన 15 శాతం సీట్లు మాత్రమే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఉంటాయి.
చరిత్రాత్మక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహాకు ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో మన రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.- డా. రాజీవ్, చైర్మన్,మెడికల్ అండ్ హెల్త్ వింగ్, టీపీసీసీ -
స్థానికులకు మరిన్ని సీట్లు
రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపింది. ఈ నిర్ణయంతో స్థానిక విద్యార్థులకు పీజీ అడ్మిషన్లలో మరిన్ని సీట్లు లభించనున్నాయి. సమస్య పరిష్కారం కోసం టీ జూడా పలుమార్లు హెల్త్ మినిస్టర్ కు విజ్ఞప్తి చేసింది. సీఎం రేవంత్, మంత్రి దామోదరకు ధన్యవాదాలు.
- జూనియర్ డాక్టర్స్ అసోషియేషన్
స్వాగతిస్తున్నాం
మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీఎం, మంత్రి దామోదరకు హృదయపూర్వక ధన్యవాదాలు.
- హెచ్ఆర్డీఏ(హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోషియేషన్)
