మన ఫార్మాకు కరోనా మంచి చేసింది

మన ఫార్మాకు కరోనా మంచి చేసింది

హైదరాబాద్​, వెలుగు: మన ఫార్మా ఎగుమతులు 2020–21లో 18.07 శాతం పెరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా రూ. 1.83 లక్షల కోట్ల​కు చేరాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ ఎగుమతులు రూ. 1.53 లక్షల కోట్లు మాత్రమే. ఫార్మాస్యూటికల్​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​ (ఫార్మెక్సిల్​) ఈ డేటా విడుదల చేసింది. మార్చి 2021లో మన ఎగుమతులు భారీగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే ఫార్మా ఎగుమతులు రూ. 17,144 కోట్లుగా నమోదయ్యాయి. మార్చి 2021లో ఫార్మా ఎక్స్​పోర్ట్స్​ ఏకంగా 48.5 శాతం పెరిగినట్లు. అంతకు ముందు ఏడాది మార్చిలో ఫార్మా ఎగుమతులు రూ. 11,479 కోట్లు. కరోనా మహమ్మారి మన ఫార్మాస్యూటికల్​ ఇండస్ట్రీ ఎగుమతులు పెరగడానికి సాయపడిందని చెప్పొచ్చు. గ్లోబల్​గా చూస్తే కొన్ని దేశాలలో ఫార్మా ఇండస్ట్రీ గత ఏడాది నెగటివ్​ గ్రోత్​ రికార్డు చేసింది. గత ఎనిమిదేళ్ల కాలానికి చూస్తే, ఈ ఏడాది ఫార్మా ఎగుమతులే చాలా ఎక్కువని ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌‌ జనరల్‌ ఉదయ భాస్కర్​ పేర్కొన్నారు. మన దేశంలో తయారయిన జెనిరిక్స్, వ్యాక్సిన్స్​కు డిమాండ్​ భారీగా పెరిగిన నేపథ్యంలో ఎగుమతులలో ఇదే ట్రెండ్​ కొనసాగుతుందన్నారు. మన దేశపు ఫార్మా ఎగుమతులలో మూడొంతులు నార్త్​ అమెరికా మార్కెట్‌కు జరుగుతున్నాయి. ఈ మార్కెట్​కు మన ఎగుమతులు​ కిందటేడాది 12.6 శాతం పెరిగాయి. కెనడాకు ఎగుమతులు 30 శాతం, మెక్సికోకు ఎగుమతులు 21.4 శాతం ఎక్కువయ్యాయి. ఫార్మా ఎగుమతులలో రెండో ప్లేస్​లో నిలుస్తున్న సౌతాఫ్రికాకు కూడా మన ఎగుమతులు 28 శాతం పెరగడం విశేషం. లాటిన్​ అమెరికా, కరేబియన్, మిడిల్​ ఈస్ట్​, సీఐఎస్​ దేశాల నుంచి మన ఫార్మా ప్రొడక్ట్స్​కు డిమాండ్​ పెరుగుతోంది. ఆస్ట్రేలియా, యూఏఈ, ఉజ్బెకిస్థాన్​, ఉక్రెయిన్​ వంటి దేశాలకు సైతం వెళ్తున్నాయి.

రాబోయే ఏళ్లలో మన దేశపు వ్యాక్సిన్​ ఎగుమతులు చాలా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్స్​ (పీఎల్​ఐ) స్కీము ఫార్మాస్యూటికల్​ ఇండస్ట్రీ ఎదుగుదలకు మరింత ఊతమిస్తుంది. దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రస్తుతం ఇండియా నుంచి యాక్టివ్​ ఫార్మా ఇన్​గ్రీడియెంట్స్​ ఎగుమతుల కోసం చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. నార్త్​ అమెరికా, యూరప్​లే కాకుండా 40 ఇతర దేశాలలో మన ఫార్మా ఇండస్ట్రీ విస్తరించేందుకు నిర్వహించిన వర్చువల్​ బిజినెస్​ మీటింగ్స్​ మంచి ఫలితాలను తెచ్చింది. ‑ ఉదయ భాస్కర్​, ఫార్మెక్సిల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌