
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారతదేశ స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల విలువ రూ. లక్ష కోట్ల మైలురాయిని దాటింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 55 శాతం ఎక్కువ. దేశంలో ఏటా 33 కోట్లకుపైగా మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయి. సగటున సుమారు వంద కోట్ల మొబైల్ ఫోన్లు వాడకంలో ఉన్నాయని కేంద్రం తెలిపింది.
ఈ ఏడాది మొదటి క్వార్టర్లో యునైటెడ్ స్టేట్స్‌కు అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసే దేశంగా చైనాను అధిగమించి భారత్ టాప్లో నిలిచింది. గత పదేళ్లలో భారతదేశ మొబైల్ ఫోన్ల తయారీ రంగం 12 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. తద్వారా అనేక కుటుంబాలకు మేలు జరిగింది. భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
వినియోగదారులు 5జీ ఫోన్లకు, ప్రీమియం ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్ పరిశోధన సంస్థల రిపోర్టుల ప్రకారం, గత ఏడాది మొత్తం స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లలో 5జీ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు 82 శాతానికి పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 49 శాతం పెరుగుదల. రూ. 10,000–రూ. 13,000 ధరల మధ్యలో ఉన్న ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. రూ. 25 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగం కూడా 26 శాతం వృద్ధితో దూసుకెళ్తోంది. ప్రీమియం, మిడ్-రేంజ్, తక్కువ ధరల ఫోన్ల విభాగాలు వృద్ధిని సాధిస్తున్నాయి.
మూడు దశల్లో వృద్ధి
ఈ విషయమై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ‘‘భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ మూడు దశలుగా అభివృద్ధి చెందింది. మొదటి దశలో ఫినిష్డ్ గూడ్స్, రెండో దశలో సబ్-–అసెంబ్లీలు, ఇప్పుడు మూడో దశలో డీప్ కాంపోనెంట్స్ తయారీలోకి అడుగుపెడుతున్నాం. 2014–-15లో రూ. 1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, 2024–-25 నాటికి రూ. 11.3 లక్షల కోట్లకు పెరిగింది”అని ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఫోన్ల వాటా భారీగా ఉంది.
2014–-15లో రూ. 18 వేల కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2024–-25 నాటికి రూ. 5.45 లక్షల కోట్లకు చేరింది. అంటే 28 రెట్లు పెరిగింది. భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారు. ఇక్కడ 300కి పైగా తయారీ కేంద్రాలు ఉన్నాయి. తమిళనాడులో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు 47 ఉన్నాయి. ఇవి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ) ప్రవేశపెట్టిన వివిధ పథకాల కింద సహాయం పొందుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.