హార్డ్ డిస్క్​ల్లోనే ఫోన్ ట్యాపింగ్ సీక్రెట్ డేటా

హార్డ్ డిస్క్​ల్లోనే ఫోన్ ట్యాపింగ్ సీక్రెట్ డేటా
  • ఆధారాలు లభించకుండా ధ్వంసం చేసిన ప్రణీత్ రావు
  • టెక్నికల్ ఎక్స్​పర్ట్స్ సహకారం తీసుకుంటున్న పోలీసులు
  • ఎస్ఐబీ లాగర్ రూమ్ చుట్టే తిరుగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెక్నికల్ ఆధారాల కోసం పోలీసులు టెక్నికల్ ఎక్స్​పర్ట్స్ సహకారం తీసుకుంటున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) లాగర్ రూమ్​ను ప్రణీత్ రావు పూర్తిగా ధ్వంసం చేసి ఆధారాలు దొరక్కుండా చేశాడు. హార్డ్ డిస్క్​ల్లోని డేటా రిట్రీవ్ చేస్తే తప్ప లాగర్ రూమ్ అడ్డాగా జరిగిన అక్రమాలు బయటపడే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఐటీ యాక్ట్, బెదిరింపులు, బలవంతంపు వసూళ్ల కోణంలోనే లాగర్ రూమ్ ధ్వంసం కేసును స్పెషల్ టీమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసులు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, టాస్క్​ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చేసిన ప్రైవేట్ ఆపరేషన్స్​కు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటి దాకా 61 మంది స్టేట్​మెంట్లను స్పెషల్ టీమ్ పోలీసులు రికార్డు చేశారు. లాగర్ రూమ్, నాగోల్ మూసీ నది నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్​ల విడిభాగాలను ఎఫ్ఎస్ఎల్​కు తరలించారు. 

42 హార్డ్ డిస్క్​లు ధ్వంసం

ఎస్ఐబీ కేంద్రంగా నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ (ఎస్​వోటీ) సీక్రెట్ డేటా బయటపడకుండా ఉండేందుకు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు టీమ్ కుట్ర చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగానే 42 హార్డ్ డిస్క్​లు, ల్యాప్​టాప్​లు, కంప్యూటర్స్, కాల్ డేటా రికార్డర్, ఐఎంఈఐ, ఐపీడీఆర్ డేటాబేస్​ను కుట్రపూరితంగా ధ్వంసం చేసినట్టు స్పెషల్ టీమ్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను నిందితుల రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు లాగర్​రూమ్​లో జరిగిన అనధికారిక కార్యకలాపాల గురించి పోలీసులు ఆధారాలు సేకరించారు. వాటిని మాయం చేసేందుకు హార్డ్ డిస్క్​లను కట్ చేసి మూసీ నదిలో పడేయడంతో డేటా పూర్తిగా ధ్వంసమైంది. 

హార్డ్ డిస్క్​లు, ల్యాప్​టాప్​లు మార్చేసిన ప్రణీత్ రావు

రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఇల్లీగల్ ఆపరేషన్స్​కు సంబంధించిన సమాచారం అంతా హార్డ్ డిస్క్​ల్లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆధారాలు లభించకుండా సీడీఆర్ (కాల్ డీటెయిల్ రికార్డు)లు, ఐఈఎంఐ, ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటెయిల్ రికార్డు) డేటా, డెస్క్​టాప్​ల హార్డ్ డిస్క్​లు, ల్యాప్​టాప్​లు మార్చేసినట్టు ఇప్పటికే ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ప్రణీత్ రావు 42 హార్డ్ డిస్క్​లలో డేటాను తొలగించడంతో పాటు వాటి స్థానంలో వేరే వాటిని అమర్చినట్టు తెలిపారు. ఇంటెలిజెన్స్ టీమ్ సేకరించిన సిమ్ కార్డులకు చెందిన ఐఎమ్​ఈఐ నంబర్స్ కూడా తొలగించాడని వెల్లడించారు.