ముందస్తు సంకేతాలా? .. ప్రత్యేక సమావేశాల్లో ఎంపీలతో ఫొటో సెషన్‌ ఏర్పాటు

ముందస్తు సంకేతాలా? .. ప్రత్యేక సమావేశాల్లో ఎంపీలతో ఫొటో సెషన్‌ ఏర్పాటు
  • సాధారణంగా లోక్‌సభ టర్మ్ ఎండింగ్, స్టార్టింగ్ టైమ్‌లోనే ఫొటో సెషన్
  • ఇప్పుడు నిర్వహించడంతో లోక్‌సభను రద్దు చేయొచ్చని ప్రచారం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో దేశంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మొదలయ్యాయి. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే లోక్‌‌‌‌సభ ఎన్నికలు జరగొచ్చని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు కేంద్రం నిర్ణయాలు ఊతమిస్తున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించడం, ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్‌‌‌‌’ అంశంపై మాజీ రాష్ట్రపతితో కమిటీ వేయడం, ఎంపీలతో ఫొటో సెషన్‌‌‌‌ ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ముందస్తు జమిలి ఎన్నికలు జరగొచ్చని చర్చ జోరుగా సాగుతున్నది. ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 

ఈ సెషన్‌‌‌‌లో చర్చించేందుకు ముఖ్యమైన అంశాలను ఎజెండాలో చేర్చుతున్నట్లు కేంద్రం చెబుతున్నది. అయితే ఆ అంశాలు ఏవన్నవి వెల్లడించలేదు. మరోవైపు ఈ సమావేశాల్లో ఎంపీలతో ఫొటో సెషన్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇలాంటి ఫొటో సెషన్లు.. లోక్‌‌‌‌సభ టర్మ్ ముగిసినప్పుడు లేదా ప్రారంభమైనప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. దీంతో ఈ ప్రత్యేక సెషనే 17వ లోక్‌‌‌‌సభకు చివరిది కావచ్చని, సార్వత్రిక ఎన్నికలు ముందే రావచ్చని చర్చ జరుగుతున్నది.

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇలా

నవంబర్– డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో, వచ్చే ఏడాది ఏప్రిల్​– మే నెలలో, ఆ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. మరో మూడు నెలల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది  ఏప్రిల్​– మే నెలలో లోక్‌‌‌‌సభకు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌‌‌‌ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. లోక్‌‌‌‌ సభ ఎన్నికల తర్వాత కొన్ని నెలలకు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ, 2025 నవంబర్‌‌‌‌‌‌‌‌లో బీహార్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కేంద్రం ముందస్తుకు వెళ్లాలని నిర్ణయిస్తే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌‌‌‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

ఈ సమయంలోనే ఏపీ తదితర రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించవచ్చు. లేదా కేంద్రం యథాతథంగా వచ్చే ఏడాదిలో ఎన్నికలకు వెళ్తే.. త్వరలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉంది. ఇలా మే నెలలో ‘మినీ జమిలి’ నిర్వహించవచ్చని చర్చ సాగుతున్నది. ఆ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. వచ్చే ఏడాది ఆఖర్లో జరగాల్సిన పలు రాష్ట్రాల ఎన్నికలు కూడా మే నెలలోనే నిర్వహించవచ్చని ప్రచారం జరుగుతున్నది.