సినీ నటి సమంత పెళ్లి చేసుకున్నారని మీడియా, సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును ఆమె పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సద్గురు ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి ఆలయంలో ఈ పెళ్లి జరిగిందని సమాచారం. చాలా సింపుల్గా జరిగిన ఈ పెళ్లికి కేవలం 30 మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలిసింది. ఈ ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు.. కొందరు సన్నిహితుల మధ్య సమంత, రాజ్ నిడుమోరు ఒక్కటి అయినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకున్నట్లు వీళ్లిద్దరు అధికారికంగా ప్రకటించలేదు. వాళ్ల ఫ్యామిలీలు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం సమంత పెళ్లి ఫొటో అంటూ ఒక ఫొటో తెగ వైరల్ అయింది.
రాజ్ నిడుమోరు, సమంత పూజలో కూర్చున్నట్లు ఆ ఫొటో ఉంది. వాస్తవానికి ఈ ఫొటో నిజమే కానీ సందర్భం సమంత, రాజ్ నిడుమోరు పెళ్లి కాదు. నందిని రెడ్డి డైరెక్టర్గా ‘మా ఇంటి బంగారం’ అని కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సమంత, రాజ్ నిడుమోరు నిర్మాతలు. ఈ సినిమా ప్రారంభం సందర్భంగా నిర్వహించిన పూజలో సమంత, రాజ్ నిడుమోరు కలిసి కూర్చున్నారు. ఆ ఫొటోను ఇలా ఇప్పుడు వైరల్ చేస్తుండటం గమనార్హం. సమంత, రాజ్ నిడుమోరు.. ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో నిరాడంబరంగా ఈ తంతును కానిచ్చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న ఫొటోలను త్వరలో సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఉంది.
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. శోభిత ధూళిపాళ్లను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల నుంచి రాజ్ నిడుమోరు, సమంత సన్నిహితంగా ఉన్నారు. రాజ్ నిడుమోరుకు కూడా పెళ్లయింది. 2022లోనే రాజ్ నిడుమోరు, శ్యామాలీ విడాకులు తీసుకున్నారు. ఇలా.. సమంత, రాజ్ నిడుమోరు తమ వైవాహిక జీవితాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుండటం గమనార్హం.
