కామారెడ్డిలో రెచ్చిపోతున్న జేబు దొంగలు

కామారెడ్డిలో రెచ్చిపోతున్న జేబు దొంగలు

కామారెడ్డి, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌‌లో ఇటీవల పిక్​ పాకేటర్లు​ ఎక్కువయ్యారు. వరుసగా  దొంగతనాలు జరుగుతున్నప్పటికీ అటు పోలీసు శాఖ, ఇటు ఆర్టీసీ యంత్రాంగం నిఘా పెట్టడం లేదు. గత రెండు నెలల కాలంలో చిన్నవి, పెద్దవి కలిపి 50కి పైగా ఘటనలు జరిగాయి. కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. ఇంకొందరు ఫిర్యాదు చేయకుందానే వెళ్లిపోతున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల టైంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో దొంగలు మరింత రెచ్చిపోయారు. 

నిత్యం వేలాది మంది

కామారెడ్డి బస్టాండ్‌‌కు సాధారణ రోజుల్లో 50 వేల నుంచి 60 వేల వరకు,  పండుగలు,  పెండ్లిళ్లు, పంక్షన్ల టైంలో  65 వేల నుంచి 75 వేల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు.  300కు పైగా బస్సులు వచ్చిపోతుంటాయి.  జిల్లా వాసులే కాకుండా నిజామాబాద్​,  కరీంనగర్​, సిరిసిల్లా, సిద్దిపేట, ఆదిలాబాద్, నిర్మల్, హైదరబాద్, మహారాష్ట్రలకు చెందిన  వారు కూడా ఇక్కడకు వస్తారు. వందల సంఖ్యలో బస్సులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తాయి. బస్సు దిగేందుకు, ఎక్కేందుకు హడావుడి ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ మరింత అధికంగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన దొంగలు బస్టాండ్‌‌లో తిష్టవేసి పర్సులు కొట్టేయడం, బంగారు అభరణాలు చోరీ చేయడం చేస్తున్నారు. 

పట్టింపు ఏది..?

బస్టాండ్‌‌లో పోలీస్​ అవుట్ పోస్టు ఉంది. గతంలో ఇక్కడ నిరంతరం ఇద్దరు స్టాఫ్‌‌ ఉండేవారు. ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వారికి సమాచారం ఇచ్చేవారు. ఇటీవల అవుట్​పోస్టులో స్టాఫ్‌‌ ఉంచడం లేదు. సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు.  దీంతో చోరీ జరిగినప్పుడు ఎలాంటి ఆధారం దొరకడం లేదు.

వారం కింద నిజామాబాద్​నుంచి ఓ వ్యక్తి  బస్సులో కామారెడ్డి వచ్చారు. బస్టాండ్‌‌లో  బస్సు దిగాడు. కామారెడ్డికి దగ్గరలోని ఓ ఊరికి వెళ్లాల్సి ఉంది. బస్సు దిగి చూసుకునే సరికి వెనుక జేబులో పర్సు లేదు. బస్సు ఎక్కగానే టికెట్ తీసుకుని చిల్లర డబ్బులతో పాటు.. టికెట్‌‌ కూడా అదే పర్సులో పెట్టాడు. వెంటనే మళ్లీ బస్సులోకి వెళ్లి సీటు కింద వెతికినా కనిపించలేదు. అప్పుడు అర్థం అయ్యింది అతడికి.. ఎవరో తన పర్సు కొట్టేశారని.. అందులో రూ.5 వేలకు పైగా నగదు, ఇతర కార్డులు ఉన్నాయి. చివరకు ఊరికి వెళ్లేందుకు పైసలు లేకపోవడంతో తెలిసిన వ్యక్తులకు ఫోన్​చేసి బస్టాండ్‌‌ బయట వేచి ఉన్నారు. ఆవుట్ సైడ్ గేట్‌‌కు కొద్ది దూరంలో  పడి ఉన్న పర్సును చూస్తే అందులో ఉన్న పైసలు తీస్కొని పడేశారు. 

కామారెడ్డికి చెందిన ఓ యువకుడు కొద్ది రోజుల కింద హైదరాబాద్​ వెళ్లేందుకు  బస్టాండ్‌‌కు వచ్చారు. పండుగల సమయంలో  కావడంతో బస్టాండ్‌‌లో రద్దీ ఉంది.   రద్దీలోనే బస్సు ఎక్కారు. టికెట్‌‌ తీసుకుకేందుకు పైసలు ఇచ్చేందుకు పర్సు తీద్దామనే సరికి లేదు. రద్దీలో ఈ యువకుడిదే కాదు.. మరొకరి పర్సు కూడా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.

స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తాం..

బస్టాండ్‌‌లో చోరీలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో స్పెషల్ టీమ్ పోలీసులతో నిఘా ఉంచాం. ఇటీవల ఒక పిక్ ​పాకెటర్‌‌‌‌ను పట్టుకున్నాం. బందోబస్తులు ఉన్నప్పుడు అవుట్​ పోస్టులో స్టాఫ్‌‌ ఉండడం లేదు. ఇకపై నిరంతరం ఉండేలా చర్యలు తీసుకుంటాం. - నరేశ్‌‌, సీఐ, కామారెడ్డి టౌన్