పైలట్​ లేని హెలికాప్టర్​!

పైలట్​ లేని హెలికాప్టర్​!

జూన్​ 14న విజయవంతంగా పరీక్షించిన చైనా

డ్రైవర్​ లేని కార్లు చూసినం. పైలట్​ లేని విమానాలను చూసినం. వాటినే డ్రోన్లు అంటున్నం. ఇప్పుడు పైలట్​ లేని హెలికాప్టర్​ వస్తోంది. ఆ హెలికాప్టర్​ను చైనా విజయవంతంగా పరీక్షించినట్టు ఆ దేశ అధికారిక పత్రిక వెల్లడించింది. రాత్రిపూట విధుల కోసం అత్యంత ప్రతికూల వాతావరణంలో ఆ హెలికాప్టర్​ను పరీక్షించినట్టు పేర్కొంది. వివిధ రకాల ఆపరేషన్ల కోసం దానిని ఆర్మీలోకి తీసుకోబోతున్నట్టు తెలిపింది. హైనన్​ ప్రావిన్స్​లోని దక్షిణ చైనా సముద్రంపై జూన్​ 14న సెకనుకు 15 మీటర్ల వేగంతో వీచిన ఎదురు గాలుల్లో ‘ఏవీ 500’ అనే పైలట్​ లేని హెలికాప్టర్​ను పరీక్షించామని చెప్పింది. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ డ్రోన్​ హెలికాప్టర్​ పనిచేస్తుందని వెల్లడించింది.

పెట్రోలింగ్​, నిఘా, యుద్ధం, జరిగిన నష్టాన్ని అంచనా వేయడం వంటి వాటిని దీని ద్వారా చేయొచ్చని వివరించింది. అంతేగాకుండా ఉగ్రవాద నిర్మూలనకు వాడొచ్చని చెప్పింది. అగ్ని ప్రమాదాల్లో సహాయ చర్యల కోసం వినియోగించొచ్చని తెలిపింది. విపత్తుల్లో జరిగిన నష్టాన్ని ఈ హెలికాప్టర్​ ద్వారా అంచనా వేయొచ్చంది. ఏవీ 500కు ఆయుధ వెర్షన్​ అయిన ఏవీ 500 డబ్ల్యూను 2018లో చైనా విజయవంతంగా పరీక్షించింది. 175 కిలోల పేలోడ్​తో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణించింది.