నవంబర్7న పైన్ ల్యాబ్స్ ఐపీఓ

నవంబర్7న పైన్ ల్యాబ్స్ ఐపీఓ
  • రూ. 2,080 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్ తన ఇనీషియల్​ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను నవంబర్ 7న ప్రారంభించనుంది. ఇది 11న ముగుస్తుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 2,080 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ నవంబర్ 6న జరుగుతుంది. కొత్త షేర్ల జారీతో పాటు, 8.23 కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్​ఎస్ కూడా ఉంటుంది. 

పీక్ ఎక్స్​వీ పార్టనర్స్, పేపాల్, మాస్టర్ కార్డ్, టెమాసెక్ వంటి సంస్థలు ఓఎఫ్​ఎస్ కింద తమ షేర్లను విక్రయించనున్నాయి. కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను అప్పుల చెల్లింపు, ఐటీ ఆస్తులలో పెట్టుబడి, క్లౌడ్ మౌలిక సదుపాయాల ఖర్చులు, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలకు పైన్ ల్యాబ్స్ ఉపయోగిస్తుంది. క్విక్‌‌‌‌‌‌‌‌సిల్వర్ సింగపూర్ వంటి అనుబంధ సంస్థలలో పెట్టుబడి పెట్టడం ద్వారా విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తోంది. 

నోయిడాకు చెందిన ఈ ఫిన్​టెక్​ కంపెనీ వ్యాపారులు, వినియోగదారుల బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు, సంస్థలు, ఆర్థిక సంస్థల కోసం డిజిటల్ పేమెంట్స్​ సొల్యూషన్స్​ను అందిస్తుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ. 11.42 లక్షల కోట్ల విలువైన చెల్లింపులను ప్రాసెస్ చేసింది.  

ఐపీఓకు షాడోఫాక్స్ 

లాజిస్టిక్స్ సేవల సంస్థ షాడోఫాక్స్ టెక్నాలజీస్, తన ఐపీఓ ద్వారా రూ. రెండు వేల కోట్లను సమీకరించడానికి సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది. ఈ ఐపీఓలో రూ. 1,000 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ, రూ. 1,000 కోట్ల విలువైన ఓఎఫ్​ఎస్ ఉంటాయి. ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ ఇంటర్నెట్, ఎయిట్ రోడ్స్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్, మిరా ఆస్సెట్, స్నాప్‌‌‌‌‌‌‌‌డీల్ వ్యవస్థాపకులైన కునాల్ బహల్, రోహిత్ కుమార్ బన్సల్ వంటి వారు ఓఎఫ్​ఎస్ కింద షేర్లను విక్రయించనున్నారు. 

నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచడానికి, కొత్త ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్, సార్ట్ కేంద్రాల లీజు చెల్లింపులకు, బ్రాండింగ్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ కార్యక్రమాలకు ఈ నిధులను ఉపయోగించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్, టీపీజీ వంటి ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతు ఉన్న ఈ సంస్థ, ఈ–-కామర్స్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ పార్సిల్, విలువ ఆధారిత సేవలను అందిస్తోంది. కంపెనీ ఆదాయంలో 75 శాతం ఈ–కామర్స్ విభాగం నుంచే వస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,485 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది.