ముదిరాజ్లను బీసీ-ఏ లోకి మార్చాలి : పిట్టల రవీందర్

ముదిరాజ్లను బీసీ-ఏ లోకి మార్చాలి : పిట్టల రవీందర్
  • ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్

నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్​లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి వెంటనే మార్చాలని ముదిరాజ్ అధ్యయన వేదిక అధ్యక్షుడు, ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో నిర్వహించిన ముదిరాజ్ జెండా పండుగ కార్యక్రమానికి ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముదిరాజ్​లు రాష్ట్రంలో 60 లక్షల మందికిపైగా ఉన్నారని.. వీరంతా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. ముదిరాజ్​లంతా పూర్తిస్థాయిలో అభివృ ద్ధి చెందాలంటే ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. 

హైకోర్టు సూచించిన విధంగా గ్రామాల్లోని ప్రతి చెరువులో 18 ఏండ్లు నిండిన ముదిరాజ్​లకు సభ్యత్వాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మత్స్యకారుల సభ్యత్వాల విషయంలో వివాదాలకు తావు లేకుండా జిల్లా మత్స్య అభివృద్ధి శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్​లు పోటీ చేసి రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నేతలు బొజ్జ నారాయణ, సలేందర్ శివయ్య, బోండ్ల గంగాధర్, బర్మ రాజనర్సయ్య, అనిల్, కిష్టయ్య, దర్శనం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.