
- గడువు దగ్గర పడుతుందనే తొందర లేదు
- యూకే, ఆస్ట్రేలియా, యూఏఈతో జరిగిన వాణిజ్య చర్చల్లో
- రైతు ప్రయోజనాలను కాపాడాం: మంత్రి పియూష్ గోయల్
- ప్రతీకార సుంకాలకు బదులు చర్చలకే ఇండియా ప్రాధాన్యం
న్యూఢిల్లీ: ఇండియా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం తొందరపడటం లేదని, ముఖ్యంగా తన ఆర్థిక ప్రయోజనాలను పణంగా పెట్టే ఒప్పందాలను అంగీకరించదని వాణిజ్య పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ జాతీయ ప్రయోజనాలు ప్రధానమని, విదేశీ ఒత్తిళ్లు లేదా గడువులకు లొంగబోమని స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 2న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 26 శాతం అదనపు సుంకాలు ఇండియాపై గణనీయ ప్రభావం చూపాయి. ఈ సుంకాలను 90 రోజులు (జులై 9 వరకు) నిలిపివేసి, తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి జులై 2 వరకు రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందం వాషింగ్టన్‌లో చర్చలు జరిపింది.
వ్యవసాయం, డెయిరీ రంగాలు కీలకం
గోయల్ మాట్లాడుతూ, “ఇరువైపులా లాభం ఉంటేనే ఒప్పందం జరుగుతుంది. లేకపోతే కుదరదు” అని జులై 9 గడువును తోసిపుచ్చారు. ఎన్‌డీటీవీ రిపోర్ట్ ప్రకారం, ఈ గడువులోపు ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం తక్కువ. ప్రస్తుతం యూఎస్, ఇండియా తాత్కాలిక ఒప్పందంలో గూడ్స్ ట్రేడ్‌పై మాత్రమే ఫోకస్ పెట్టాయి.
స్టీల్, అల్యూమినియం, ఆటో కాంపోనెంట్స్‌పై మినహాయింపులను తాత్కాలికంగా పక్కనపెట్టాయి. ఇండియా లేబర్స్ ఎక్కువగా అవసరమయ్యే రంగాలైన లెదర్, ఫుట్‌వేర్, టెక్స్‌టైల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికాను కోరుతోంది. యూఎస్‌లో టెక్స్‌టైల్స్‌పై 26శాతం సుంకం 10శాతానికి తగ్గితే వెల్‌స్పన్ లివింగ్, ట్రైడెంట్ వంటి కంపెనీలు లాభపడతాయి.
ప్రతీకార సుంకాలు లేనట్టేనా?
ఇండియా నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియం, ఆటో పార్ట్స్‌పై 50 శాతం సుంకాలను అమెరికా విధిస్తామని ప్రకటించింది. దీనిపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) లో భారత్ రెండు నోటీసులు జారీ చేసింది. యూఎస్ నుంచి చేసుకునే ఆటో పార్ట్స్, స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ప్రతీకార సుంకాలను విధించే హక్కు మనకు ఉంది.
ఈ ప్రతీకార సుంకాలు 2.89 బిలియన్ డాలర్ల యూఎస్ దిగుమతులను ప్రభావితం చేస్తాయి. ఇవి 30 రోజుల నోటీసు తర్వాత అమలు కావాలి. కానీ ఇంకా అమలు కాలేదు. అమెరికాతో నెలకొన్న గొడవలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇండియా చూస్తోంది. కాగా, ట్రేడ్ డీల్ కుదరడంలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుండగా, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రాసెస్‌ను చూసుకుంటున్నారు.
1993 బ్యాచ్ మణిపూర్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్, రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం యూఎస్ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. రాజేష్‌కు ఆసియా ఎఫ్‌టీఏ (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్), ఆస్ట్రేలియా, పెరూతో కుదిరిన ఎఫ్‌టీఏ చర్చల్లో అనుభవం ఉంది. వ్యవసాయ ఎగుమతులపై ఎక్స్‌పర్ట్ కూడా. అమెరికా బృందంలో టారిఫ్ స్ట్రాటజీని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెడీ చేయగా, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్‌నిక్, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామీసన్ గ్రీర్, వాణిజ్య సమన్వయకర్త బ్రెండన్ లించ్ ప్రాసెస్‌ను చూసుకుంటున్నారు.
చర్చల్లో అడ్డంకులు..
భారత వ్యవసాయ రంగంలో సుంకాలు తగ్గించాలని, జన్యుపరంగా మార్పు చేసిన పంటలు (జీఎం కార్న్, సోయా), ఆటోమొబైల్స్, విస్కీపై మినహాయింపులు ఇవ్వాలని అమెరికా కోరుతోంది. ఇండియా వ్యవసాయ, డెయిరీ రంగాలను రక్షించడంపై దృష్టి సారించింది. ఇవి రాజకీయంగా, ఆర్థికంగా సున్నితమైనవి. యూకే, ఆస్ట్రేలియా, యూఏఈతో జరిగిన చర్చల్లో రైతుల ప్రయోజనాలను కాపాడామని గోయల్ పేర్కొన్నారు.
కాగా, ట్రంప్ ఇచ్చిన టారిఫ్ పాజ్ గడువు ఈ నెల 9తో ముగుస్తుంది. ఆ తర్వాత నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఇండియన్ ప్రొడక్ట్‌లపై 26 శాతం సుంకాలు పడతాయి. ఇవి 53 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం చూపుతాయి.
ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ఫార్మా, ఆటో రంగాలు నష్టపోతాయి. ఇండియా డబ్ల్యూటీఓ నిబంధనల కింద ప్రతీకార సుంకాలతో స్పందించే అవకాశం ఉంది. కానీ చర్చలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.