అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ వెనుక అసలు కారణాలివే..!

అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ వెనుక అసలు కారణాలివే..!
  • ల్యాండ్ అవుతుండగా ప్లేన్ క్రాష్.. అజిత్ పవార్ మృతి
  • మహారాష్ట్ర డిప్యూటీ సీఎంతోపాటు మరో నలుగురు దుర్మరణం 
  • బారామతి ఎయిర్​పోర్టు రన్​వే వద్ద విమాన ప్రమాదం
  • జడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఘోరం 
  • దట్టమైన పొగమంచుతో కనిపించని టేబుల్ టాప్ రన్​వే
  • రన్ వేకు 50 మీటర్ల దూరంలో బండరాయిని ఢీకొట్టి కూలిన విమానం 
  • ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం 
  • ఇవాళ (జనవరి 29) బారామతిలో అంత్యక్రియలు 
  • ప్రమాదంపై అనుమానాలు: ఖర్గే

బారామతి: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సీపీ) చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) విమాన ప్రమాదంలో మరణించారు. బుధవారం (జనవరి 28) ఉదయం పుణె జిల్లాలోని బారామతి ఎయిర్​పోర్టు వద్ద ల్యాండ్ అవుతుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. దట్టమైన పొగమంచు వల్ల టేబుల్ టాప్ రన్ వే(ఎత్తైన స్థలంలో ఉండే రన్ వే) సరిగ్గా కనిపించక విమానం రన్ వేకు 50 మీటర్లు పక్కగా వెళ్లి బండరాయిని ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగినట్టుగా భావిస్తున్నారు. 

ప్రమాదంలో అజిత్ పవార్​తోపాటు పైలట్ సుమిత్ కపూర్, కోపైలట్ శాంభవి పాఠక్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ విదిప్ జాధవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ కూడా దుర్మరణం చెందారు.  పుణె జిల్లాలో ఫిబ్రవరిలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ బుధవారం ఉదయం 8.10 గంటలకు వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన లియర్ జెట్ 45 విమానంలో ముంబై నుంచి బయలుదేరారు. ఆ విమానం ఉదయం 8.45 గంటలకల్లా బారామతి ఎయిర్ పోర్టు ప్రాంతానికి చేరుకుంది. 

కానీ అక్కడ పొగమంచు వల్ల రన్ వే సరిగ్గా కనిపించకపోవడంతో పైలెట్లు ఏటీసీతో సంప్రదించి, గో అరౌండ్ (చుట్టూ చక్కర్లు కొట్టి రావడం)కు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏటీసీ నుంచి మళ్లీ గ్రీన్ సిగ్నల్ రావడంతో పైలెట్ విమానాన్ని తిరిగి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే విమానం రన్ వే పక్కగా వెళ్లి కూలిపోయింది. విమానం చివరగా 8.45 గంటలకు ఫ్లైట్ రాడార్ నుంచి అదృశ్యమైంది. ఆ తర్వాత ఒక నిమిషానికే కూలిపోయినట్టుగా చెప్తున్నారు.

పెద్ద శబ్దంతో పేలుడు.. ఆ వెంటనే మంటలు  

విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున శబ్దంతో పేలుడు సంభవించి మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. ప్లేన్ క్రాష్ కాగానే పేలుడుతో మంటలు ఎగిసిపడిన దృశ్యం సమీపంలోని ఓ రోడ్డు పక్కన ఉన్న షాపు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. విమానం తక్కువ ఎత్తులోనే వస్తుండటంతో కూలిపోతుందేమో అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చూస్తుండగానే విమానం కూలి పేలుడు శబ్దాలు వినిపించాయని, ఆ వెంటనే మంటలు ఎగిసిపడ్డాయని చెప్పారు. 

వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లామని, కానీ మంటలు తీవ్రంగా ఉండటంతో ఎవరినీ కాపాడలేకపోయామని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కాగా, గాగుల్స్, చేతికి ఉన్న వాచీ ఆధారంగా అజిత్ పవార్ భౌతికకాయాన్ని గుర్తించామని స్థానిక ఎస్పీ తెలిపారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హుటాహుటిన బారామతికి చేరుకున్నారు. అజిత్ పవార్ విషాద మరణం నమ్మలేకపోతున్నానని, తాను ఓ మంచి మిత్రుడిని కోల్పోయానని అన్నారు. 

టెక్నికల్ ఫాల్ట్ వల్లే ప్రమాదం? 

విమానం క్రాష్ అవుతుండగా రికార్డ్ అయిన ఓ సీసీటీవీ ఫుటేజీని బట్టి చూస్తే విమానంలో టెక్నికల్ ఫాల్ట్ తలెత్తి ఉండవచ్చని, ఏదో సమస్య వల్లే క్రాష్ అయి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. విమానం ఎడమవైపు వాలిపోయి వేగంగా దూసుకెళ్లడం, కూలిన వెంటనే మంటలు ఎగిసిపడటం వీడియోలో రికార్డ్  అయింది.

రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖుల సంతాపం 

అజిత్ పవార్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అజిత్ పవార్ మరణం దిగ్భ్రాంతికి, తీవ్ర విషాదానికి గురిచేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మహారాష్ట్ర ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రజా నాయకుడు అని కొనియాడారు.  

కుట్రకోణం లేదు.. రాజకీయాలొద్దు: శరద్ పవార్ 

ప్లేన్ క్రాష్ లో అజిత్ పవార్ మృతి చెందడం వెనక ఎలాంటి కుట్ర కోణం లేదని, ఇది పూర్తిగా ప్రమాదం వల్లే జరిగిన ఘటన అని ఎన్ సీపీ (ఎస్పీ) చీఫ్, అజిత్ పవార్ బాబాయ్ శరద్ పవార్ అన్నారు. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘మన చేతుల్లో ఏమీ లేదు. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఈ లోటు తీర్చుకోలేనిది. ఈ బాధను ఎప్పటికీ భరించాల్సిందే. దయచేసి, ఇందులోకి రాజకీయాలు తీసుకురాకండి” అని ఆయన కోరారు. 

అజిత్ పవార్ కు భార్య సునేత్ర (రాజ్యసభ ఎంపీ), కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్ ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే హుటాహుటిన బారామతికి చేరుకున్నారు. మెడికల్ కాలేజీలో అజిత్ పవార్ భౌతికకాయాన్ని సందర్శించారు. కాగా, గతంలో అజిత్ తిరుగుబాటుతో ఎన్సీపీ రెండు ముక్కలైంది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఎన్సీపీ రెండు వర్గాలు కలిసి పోటీ చేశాయి. ఇంతలోనే అజిత్ దుర్మరణానికి గురవడంతో ఆయన కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. 

పొగమంచే కారణం..!: రామ్మోహన్ నాయుడు

అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనక భద్రతాపరమైన లోపం లేదని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాక ఆయన మీడియాతో మాట్లాడారు. పొగమంచు కారణంగా విజిబిలిటి తగ్గిపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని చెప్పారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు ప్రారంభించింది.

అధికారిక లాంఛనాలతో నేడు అంత్యక్రియలు 

బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్ లో గురువారం ఉదయం 11 గంటలకు అజిత్ పవార్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం సెలవు, మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.