ట్రాఫిక్ వాలంటీర్లు వస్తున్నారు..రద్దీ ప్రదేశాల్లోవాలంటీర్లను నియమించి ట్రాఫిక్‌ కు చెక్

ట్రాఫిక్ వాలంటీర్లు వస్తున్నారు..రద్దీ ప్రదేశాల్లోవాలంటీర్లను నియమించి ట్రాఫిక్‌ కు చెక్
  •     త్వరలో వ్యాపారస్తుల భాగస్వామ్యంతో సొసైటీ ఏర్పాటు చేసేలా కార్యాచరణ 
  •     సైబరాబాద్ తర్వాత సూర్యాపేట జిల్లాలోనే 

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు వాలంటీర్లను నియమించాలని ప్లాన్ చేస్తున్నారు. రోజూ రెండు లక్షలకు మందికి పైగాజిల్లా కేంద్రానికి వివిధ పనుల రీత్యా వస్తున్నారు. 

దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. విద్యా, వైద్యం, వాణిజ్య కేంద్రంగా మారుతున్న సూర్యాపేటలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రజలు, వ్యాపారస్తులను భాగస్వాములుగా మార్చే దిశగా ఎస్పీ నరసింహా ట్రాఫిక్ వాలంటీర్ల నియామకంపై అవగాహన కల్పిస్తున్నారు. 

ట్రాఫిక్ వాలంటీర్ల నియామకం.. 

ప్రస్తుతం ట్రాఫిక్ సిబ్బంది తక్కువగా ఉండటంతో, వాలంటీర్ల సహకారంతో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించొచ్చు  వాలంటీర్ల నియామకాన్ని వ్యాపారవేత్తల సహకారంతో చేపట్టి,తగిన జీతం చెల్లించేలా వ్యూహం రూపొందిస్తున్నారు. 

ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సాయమందిస్తే దాన్నే వాలంటీర్ల జీతాలుగా వినియోగించనున్నారు.ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా కేంద్రంలో ప్రారంభించి, విజయవంతమైతే ఇతర పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానం ప్రస్తుతం సైబరాబాద్‌ లో విజయవంతంగా అమలవుతుండగా, రాష్ట్రంలో రెండవ జిల్లాగా సూర్యాపేటలో ప్రవేశపెట్టనున్నారు. 

త్వరలో ప్రారంభిస్తాం

ట్రాఫిక్ నియంత్రణకు వాలంటీర్ల వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తాం.  వ్యాపారవేత్తలతో సమావేశాలు జరిపి కార్యాచరణను అమలు చేస్తాం.  ప్రజల భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేస్తాం ఎస్పీ నరసింహ