టేబుల్​ పైన మొక్క.. ఒత్తిడిని తగ్గిస్తదట

టేబుల్​ పైన మొక్క..  ఒత్తిడిని తగ్గిస్తదట

ఒక్కసారి కళ్లు మూసుకొని..  ఆఫీస్​ టేబుల్​పై ఏమేమున్నాయో గుర్తుకు తెచ్చుకుంటే…కళ్లపై ఒత్తిడి పెంచే కంప్యూటర్​ మానిటర్, దాని పక్కనే… చెవిలో జోరీగలా సౌండ్​ చేసే సీపీయూ, ఎక్కడలేని డస్ట్​నంతా తనలోనే దాచుకున్న కీబోర్డు, ఆపరేషన్​ థియేటర్​ బయట వెలిగే ఎర్రని లైట్​ను గుర్తుకుతెచ్చే మౌస్, ఈ సెటప్​ చుట్టూ చిరాకు తెప్పించే కేబుల్స్​.. అంతేకాదు, ఏమాత్రం పరధ్యానంగా కదిలినా చేయి తగిలి కింద పడిపోయే వాటర్ బాటిల్​, ఎంతో కాన్సన్​ట్రేషన్​గా పనిచేస్తున్నప్పుడు డిస్టర్బ్​ చేసే ఫోన్​, ఒంట్లోని శక్తినంతా కూడదీసుకొని కాళ్లు బలంగా భూమిపై పెట్టి వెనక్కి నెడితేకానీ కదలని చైర్​.. ఇవన్నీ కనిపిస్తున్నాయా?

ఇప్పుడు ఇంకోసారి కళ్లు మూసుకొని.. ఆఫీస్​ చైర్​లో కూర్చున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్​ను ఫేస్​ చేస్తున్నారో ఓ సారి గుర్తుకు తెచ్చుకుంటే..టార్గెట్​ను పదే పదే గుర్తుచేసే బాస్, సమయానికి స్పందించని  కస్టమర్, మొదటివారంలోనే మూడంకెలకు పడిపోయే బ్యాంక్​ బాలెన్స్​, క్రెడిట్​ కార్డ్​ డ్యూ డేట్​ను పదే పదే గుర్తుచేసే ఫోన్ మెసేజ్​.. ఇవి చాలవన్నట్లు ‘చంటోడికి మళ్లీ జ్వరం వచ్చింది’ అంటూ ఇంటిదగ్గర నుంచి వచ్చే ఫోన్​.. ఆఫీసు పనితోపాటు ఈ సమస్యలన్నీ ఇబ్బంది పెడుతుంటాయి.

ఆఫీస్​ టేబుల్​ మీద ఉన్న ఫర్నిచర్​తోపాటు చైర్​లో కూర్చోగానే ఇబ్బంది పెట్టే ప్రతి సమస్యా మన ఒత్తిడిని పెంచేదే. మరి ఈ ఒత్తిడిని చిత్తు చేయాలంటే ఏం చేయాలో తెలుసా?  చిన్న ఇండోర్​ ప్లాంట్​ను ఆఫీస్​ టేబుల్​ మీద పెట్టుకోవాలి. ఆఫీస్​ రూమ్​లోని కార్బన్​డయాక్సైడ్​నే కాదు..  మనలోని ఒత్తిడిని కూడా ఆ చిన్న మొక్క పీల్చేసుకుంటుందట. ఇది వాస్తు పండితులు, జ్యోతిష్యులు చెబుతున్న మాట కాదు.. జపాన్‌‌లోని హ్యోగో యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు రీసెర్చ్​ చేసి సైంటిఫిక్​గా రుజువుచేసిన నిజం.

ఆఫీస్​ టేబుల్​ ఆదాయంతోపాటు అనారోగ్యాన్ని కూడా ఇస్తుందనే విషయం మీకు తెలుసా? తీవ్రమైన పనిఒత్తిడి, గంటల తరబడి కుర్చీకే అతుక్కొని కూర్చోవడం, ఒక్కోసారి తిండిమీద కూడా ధ్యాస లేకుండా పనిచేయడం.. ఇవన్నీ అనారోగ్యానికి దారితీసేవే. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆఫీస్​ టేబుల్​ అనారోగ్యాన్ని కాకుండా కేవలం ఆదాయాన్ని మాత్రమే ఇస్తుందట. మధ్య మధ్యలో కొంచెంసేపు రెస్ట్​ తీసుకోవడం, ప్రతి అరగంటకోసారైనా కుర్చీలో నుంచి లేచి ఓ పది అడుగులు నడవడం, ఎంత పని ఉన్నా సమయానికి తినడం లాంటివి చేస్తే శారీరక ఆరోగ్యంమీద పెద్దగా ప్రభావం పడదు. అయితే స్ట్రెస్​ను పెంచే పని ఒత్తిడి నుంచి బయట పడాలంటే మాత్రం ప్లానింగ్​ ప్రకారం పనిచేసేందుకు ప్రయత్నించాలి. అందుకు సరైన మార్గం ఆఫీస్​ టేబుల్​ మీద ఓ చిన్న ఇండోర్​ ప్లాంట్​ను పెట్టుకోవడమే. ప్లేసుంటే ఓ నాలుగైదు పెట్టుకొని, వర్క్​ బ్రేక్​లో  చూపు తిప్పుకున్నప్పుడు అంతా పచ్చదనమే కనిపించేలా పెట్టుకుంటే ఇంకా బెటర్​. ఎందుకంటే.. కంటికి పచ్చగా, రంగురంగుల్లో, రకరకాల డిజైన్లలో కనిపించే ఈ మొక్కలు ఒత్తిని చాలాబాగా తగ్గిస్తాయట.

ఒత్తిడి ఎందుకు పెరుగుతుందంటే..

ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం, స్క్రీన్ చూడడం వంటివి తెలియకుండానే మనలో ఒత్తిడిని, ఆందోళనలను పెంచుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి జీవక్రియల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల హార్మోన్స్‌‌ బ్యాలెన్స్​ దెబ్బతింటుంది. స్ట్రెస్​కు ప్రధాన కారణంగా చెప్పుకొనే కార్టిసాల్​, అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి.   దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఈ హార్మోన్ల​ విడుదలను తగ్గించడంలో ఇండోర్​ ప్లాంట్స్​ ఓ మెడిసిన్​లా పనిచేస్తాయని చెబుతున్నారు సైంటిస్టులు. కొన్నిరకాల ఇండోర్ ప్లాంట్స్ మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచడానికి ఎలా ఉపయోగపడతాయనే విషయమై నిర్వహించిన ఓ స్టడీ రిపోర్ట్​ను హార్ట్​ టెక్నాలజీ జర్నల్​ ఇటీవలే ప్రచురించింది.

“మసాహిరో టయోడా” పేరుతో జపాన్‌‌లోని హ్యోగో యూనివర్సిటీ నిర్వహించిన రీసెర్చ్​లో ఫిజికల్​, మెంటల్​ హెల్త్​పై ఇండోర్​ ప్లాంట్స్ ఎలా ప్రభావం చూపుతాయనే విషయమై స్టడీ చేశారు. ఇందుకోసం జపాన్​లోని 63 ఆఫీసుల్లో ఈ ఇండోర్ ప్లాంట్స్ ఉంచి పరిశోధనలు చేశారు. ఉద్యోగుల డెస్క్‌‌ల మీద  మొక్కలను పెట్టడానికి ముందు, పెట్టిన తర్వాత మానసిక, శారీరక ఒత్తిళ్లలో  కనిపించిన మార్పులను రికార్డు చేశారు.  ఈ రీసెర్చ్‌‌లో పాల్గొన్న వారికి అలసటగా అనిపించినప్పుడు వారి డెస్క్‌‌ల మీద ఉంచిన ప్లాంట్స్ చూస్తూ కనీసం 3 నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అనంతరం ఉద్యోగుల మానసిక ఒత్తిడిని స్టేట్-ట్రెయిట్ యాంగ్జయిటీ ఇన్వెంటరీని ఉపయోగించి లెక్కకట్టారు. ఈ రీసెర్చ్‌‌లో పాల్గొన్న వారిలో డెస్క్ ప్లాంట్స్ పెట్టుకొని, 3 నిమిషాల విశ్రాంతిని పాటించాక ఈ ఒత్తిడి గణనీయంగా తగ్గినట్లు తేలింది.

ఒత్తిడి ఎందుకు తగ్గిందంటే..

డెస్క్​పై పెట్టుకునే మొక్కను ఉద్యోగులే ఎంచుకునే అవకాశం కల్పించారు. దీంతో తమకు ఇష్టమైన రంగులున్న మొక్కలను వెంటతెచ్చుకొని డెస్క్​పై పెట్టుకున్నారు. దీంతో పనిచేస్తున్నప్పుడు కొంచెం అలసటగా అనిపించినా.. వారికి ఇష్టమైన మొక్కలను చూడడం వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గింది. తాము ఇష్టంగా తెచ్చి పెట్టుకున్న మొక్కను ఉద్యోగులు అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల ఎప్పుడూ పనిగురించే కాకుండా కొంచెంసేపు ఈ మొక్కల గురించి కూడా ఆలోచించడం వల్ల స్ట్రెస్​కు లోనుకాకుండా ఉన్నారు.

ఇలా మొక్కలను డెస్క్​పై పెట్టుకోవడం వల్ల ఉద్యోగులు తమ అభిరుచిని ఇతరులతో పంచుకున్నారు. దీనివల్ల ఉద్యోగుల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఇది కూడా ఒత్తిడి తగ్గడానికి కారణమైంది. తాము ఆఫీసుకు రానిరోజు మొక్క కాపాడే బాధ్యతను తోటి ఉద్యోగికి అప్పజెప్పడం, తిరిగి వచ్చాక వారికి థ్యాంక్స్​ చెప్పడం వంటి చిన్న చిన్న విషయాలు ఒత్తిడిని బాగా తగ్గించాయి. కావాలనే కాకుండా అనుకోకుండానే ఉద్యోగుల దృష్టి చాలాసార్లు తాము పెంచుకుంటున్న మొక్కలపై పడడాన్ని పరిశోధకులు గుర్తించారు. అంటే స్క్రీన్​ చూసే టైం కొంత తగ్గింది. ఇది కూడా ఒత్తిడిని తగ్గించడానికి కారణమైంది.

see also: డిప్రెషన్‌‌ అమ్మాయిలకే ఎక్కువ!

‘నారప్ప’ రచ్చ : మా వాళ్లే రియల్‌‌ హీరోలు..!

పిల్లల ఆకలి తీరిస్తే సరిపోదు..!