
- 15రోజుల్లోనే క్వింటాల్‌కు రూ.300 తగ్గుదల
- కొనుగోలు సెంటర్లు పెట్టని సర్కార్
- అయినకాడికి దళారులకు అమ్ముకుంటున్న రైతులు
- పెట్టుబడులు వచ్చేటట్టు లేవని ఆందోళన
- సర్కార్ ఆదుకోవాలంటున్న అన్నదాతలు
కామారెడ్డి , వెలుగు : పంట ఉత్పత్తులు రైతుల చేతికొస్తున్న టైంలో మార్కెట్లో రేటు డౌన్ అయిపోతోంది. ఈ సీజన్లో మక్క పంటకు అదే పరిస్థితి వచ్చింది. దిగుబడులు వస్తున్న టైంలో రేటు తగ్గిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నరు. పంట చేతికి రాగానే రైతులు ఏ రేటుకైనా అమ్ముతారనే ఉద్దేశంతో వ్యాపారులు, దళారులు కలిసి రేటును తగ్గిస్తున్నరు. 15 రోజుల కింద మక్కల ధర క్వింటాల్‌కు రూ.2,200 నుంచి రూ.2,300 వరకు పలికింది.
ఇప్పుడు క్వింటాల్‌కు రూ.1,900 నుంచి రూ.2వేల మధ్య కొంటున్నరు. క్వింటాల్‌కు రూ.300వరకు తగ్గింది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో పంట వస్తే ఈ రేటు మరింత తగ్గుతుందని రైతులు వాపోతున్నరు.
6.24లక్షల ఎకరాల్లో సాగు..
యాసంగిలో రాష్ర్ట వ్యాప్తంగా 6.24 లక్షల ఎకరాల్లో మక్క పంటను సాగు చేశారు. పలు జిల్లాలో 25 వేల ఎకరాల నుంచి 50వేల ఎకరాల వరకు వేశారు. కామారెడ్డి జిల్లాలో 38 వేల ఎకరాల్లో ఉంది. రెండు వారాల నుంచి మక్క కోతలు షురువయ్యాయి. పంట ఉత్పత్తులు రైతుల చేతికి వస్తున్నప్పటికీ సెంటర్ల ఏర్పాటుపై సర్కార్ ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు చేపట్టలేదు. గతంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,962 ఉంది. వివిధ అవసరాలకు మక్కలకు డిమాండ్ ఫుల్ గా ఉండడంతో వ్యాపారులు పోటి పడి ఎక్కువ రేటు పెట్టి మరి కొన్నారు.
ఊళ్లలోకి దళారులు..
యాసంగిలో సాగు చేసిన మక్క ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు రేటు తగ్గించారు. సర్కార్ కూడా ఇంకా కొనుగోలు సెంటర్లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1,900 నుంచి రూ.2వేల మధ్యే కొంటున్నారు. సాగు విస్తీర్ణం ఈ సారి పెరగడంతో ప్రారంభంలోనే రేటు తగ్గితే మొత్తం పంట మార్కెట్ లోకి వస్తే పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలోని ఊళ్లలోకి వెళ్లి దళారులు పంట కొంటున్నారు. కాంటా పెట్టిన తర్వాత క్వింటాల్‌కు 2 కిలోల వరకు కోత పెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. జనగామ జిల్లాలో క్వింటాల్‌కు రూ.1,800 నుంచి రూ.1,900 వరకు చెల్లిస్తున్నారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2వేలు ఉంది. ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1800 నుంచి రూ.1,990 వరకు కొంటున్నారు. పంట సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి.
ఈ పరిస్థితుల్లో పంట ఉత్పత్తుల రేట్లు తగ్గుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు కూడా పలు జిల్లాల్లో పంట దెబ్బతింది. సాగు ఖర్చులు పెరిగి ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతుంటే, ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతినటం, మార్కెట్లో రేటు తగ్గుతుండటం రైతులను ఆర్థికంగా మరింత దెబ్బతిస్తోంది.
పంట చేతికి రాగానే రేటు తగ్గిస్తున్రు..
యాసంగిలో 3 ఎకరాల్లో మక్క పంట వేసిన. మేం పంట వేసేటప్పుడు క్వింటాల్‌కు రూ.2,300 రేటు ఉండే. 20 రోజుల కింద కూడా ఇదే రేటు ఉండే. ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 1,950 నుంచి రూ.2వేలు అంటున్నరు. ఇంకా 15 రోజులు అయితే ఇంకా మక్కలు ఎక్కువగా వస్తే రేటు ఇంకా దిగుతంది. గవర్నమెంట్ కొంట లేదు కాబట్టి ఊర్లకు దళారులు వచ్చి తక్కువ రేటుకు కొంటున్రు. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెడ్తిమి. అప్పులు కట్టేందుకు తక్కువ రేటుకైనా అమ్ముకోవాల్సి వస్తాంది. - మామిడి శ్రీనివాస్‌రెడ్డి, రామేశ్వర్‌పల్లి, కామారెడ్డి
రేటు పెడుతలేరు..
10 ఎకరాల్లో మక్క పంట వేసిన. కోసి అరబోసినం. అమ్ముదామంటే క్వింటాల్‌కు రూ. 2వేలు అంటున్రు. మొన్నటి దాక రూ.2,300 ఉండే. గా రేటు పెట్టమన్న లేదంటున్రు. రేటు ఇంకా తగ్గుతదేమేనని భయమేస్తంది. బయట అన్ని వస్తువుల రేట్లు పెరిగినట్లు రైతులు పండించే పంటల రేట్లు మాత్రం పెరుగుతలేవు. - రాజు, హన్మాజీపేట, కామారెడ్డి
పెట్టుబడి వచ్చేటట్టు లేదు..
యాసంగిలో 2 ఎకరాల్లో మక్క సాగు చేసిన. గిప్పుడు క్వింటాల్‌కు రూ.2వేలు కూడా లేదు. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి ఉన్నది. మక్క రైతులను గవర్నమెంట్ ఆదుకోవాలె. - కొడప ఆనంద్‌రావు, మార్లవాయి, అసిఫాబాద్