ప్లాస్మా థెరపీ రిజల్ట్స్ భేష్: కేజ్రీవాల్

ప్లాస్మా థెరపీ రిజల్ట్స్ భేష్: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్లపై టెస్ట్ చేసిన ప్లాస్మా థెరపీ ట్రయల్స్ ఫలితాలు బాగున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. రాబోయే రోజుల్లో మరికొన్ని ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. ‘గత కొద్ది రోజుల్లో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్​ఆస్పత్రిలో నలుగురు పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేశాం. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ బాగున్నాయి. ఇవి ప్రారంభ ఫలితాలు మాత్రమే. కరోనా కు నివారణను కనుగొన్నామని భావించొద్దు. ఆ దిశగా ఇప్పటి ఫలితాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆ నలుగురు పేషెంట్లలో ఇద్దరిని త్వరలోనే పంపించేస్తాం. ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారు రక్తదానం చేస్తేనే ఈ ట్రీట్ మెంట్ ముందుకు సాగుతుంది. వారు రక్తదానం చేస్తే.. అదే నిజమైన దేశభక్తి’ అని పేర్కొన్నారు. పాజిటివ్ రిజల్ట్స్ పై సంతోషంగా ఉన్నామని ఇన్ స్టిట్యూట్ ఆఫ్​లివర్ అండ్ బైలియరీ సైన్స్ డైరెక్టర్ ఎస్ కె.సరీన్ తెలిపారు. మరో ఇద్దరు, ముగ్గురు పేషెంట్స్ కు ట్రీట్ మెంట్ చేయడానికి అవసరమైన రక్తం, ప్లాస్మా సిద్ధంగా ఉందన్నారు. ప్లాస్మా థెరపీ పద్ధతిలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి వైరస్ తో బాధపడుతున్న రోగికి ప్లాస్మాను మార్పిడి చేస్తారు. కోలుకున్న వ్యక్తి రక్తంలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. అవి కరోనా సోకిన రోగిని త్వరగా రికవర్ అయ్యేందుకు తోడ్పడతాయి.