బంగారం కంటే ప్లాటినమే అగ్గువ.. ఆసక్తి చూపుతున్న యువత

బంగారం కంటే ప్లాటినమే అగ్గువ.. ఆసక్తి చూపుతున్న యువత

పసిడి కంటే 40 శాతం రేటు తక్కువ
కరోనా వల్లే ప్లాటినమ్ రేట్లు తగ్గాయంటున్న ట్రేడర్లు
ప్లాటినమ్ కొనేందుకు ఆసక్తి చూపని మిడిల్ క్లాస్ జనం

న్యూఢిల్లీ: మామూలుగా అయితే ప్లాటినమ్‌‌ చాలా విలువైన లోహం. మిడిల్‌‌క్లాస్‌ జనం కొనే పరిస్థితి ఉండేదే కాదు. బంగారానికే పరిమితమయ్యేవారు. ప్రస్తుత పరిస్థితులు తలకిందులు అయ్యాయి. బంగారం కంటే ప్లాటినమ్‌‌ ధర ఏకంగా 40 శాతం తక్కువ ఉంది. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. ప్లాటినమ్‌‌ రేట్లు తగ్గాయి కాబట్టి పండగ సీజన్‌లో యువత దీనిని భారీగా కొనే అవకాశాలు ఉన్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. స్పాట్‌‌ మార్కెట్లో బుధవారం పది గ్రాముల ప్లాటినమ్‌‌ ధర రూ.30,470 ఉండగా, బంగారం ధర రూ.51 వేలకు పైగా రికార్డు అయింది. ‘‘ప్లాటినమ్‌‌, బంగారం ధరల మధ్య తేడాలు రికార్డు స్థాయులకు చేరుకున్నాయి. యువత ఎక్కువగా ఇంటర్నేషనల్‌ ట్రెండ్‌‌ను ఫాలో అవుతారు కాబట్టి వాళ్లు ప్లాటినమ్‌‌కే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్లాటినమ్‌‌, డైమండ్స్‌ కాంబినేషన్‌ చాలా బాగుంటుంది. అందుకే ప్లాటినమ్‌‌ రింగ్స్‌ గిరాకీ ఎక్కువ అవుతుంది. ధరలు తగ్గుదలతో డిమాండ్‌‌ మరింత పెరుగుతోంది. పండగ సీజన్‌ ప్లాటినమ్‌ ‌రింగ్స్‌ మరిన్ని అమ్ముడవుతాయి అన్నది మా అంచనా’’ అని ఒర్రా డైమండ్స్‌ ఎండీ దీపూ మెహతా వివరించారు.

సంపన్నులే వాడుతున్నారు..
ఇండియా సిటీల్లో ప్లాటినమ్‌ ‌వాడకం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్లాటినమ్‌‌ గిల్డ్‌‌ ఇంటర్నేషనల్‌ (పీజీఐ) ఇటీవల స్టడీ చేసింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌కు చెందిన 20–40 ఏళ్ల వయసు గల రిచ్‌ కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకుంది. కరోనా కారణంగా ఖర్చులను తగ్గించుకున్నామని మెజారిటీ రెస్పాండెంట్లు చెప్పారు. షాపులకు వెళ్లి నగలు కొనడానికి బదులు ఆన్‌లైన్‌లో కొంటున్నామని, ఎక్కువ లాభాన్నిచ్చే ప్లాటినమ్ వంటి లోహాల కొనుగోలుకు ఆసక్తి చూపుతామని అన్నారు. కరోనా వల్ల నగల వాడకం తగ్గడం నిజమే అయినా, రిచ్‌యంగ్‌‌కస్టమర్లు మాత్రం పండగ సీజన్లో ప్లాటినమ్‌‌ను కొనడానికి ఉత్సాహంగా ఉన్నారని పీజీఐ తెలిపింది.

బంగారం రేటు మరోసారి తగ్గింది..
గోల్డ్ ధరలు మళ్లీ తగ్గాయి. ఈ వారం రోజుల్లో ఆరు రోజుల్లోనూ గోల్డ్ ధరలు తగ్గుతూ వచ్చాయి. ఎంసీఎక్స్ లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.22 శాతం డౌన్ అయి 10 గ్రాముల ధర రూ.51,665గా నమోదైంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఒక శాతం పడిపోయి కేజీకి రూ.66,821గా రికార్డయింది. ఈ వారం రోజుల్లో గురువారం సెషన్‌‌లో మాత్రమే గోల్డ్ ధర లాభపడింది. మిగతా అన్ని రోజులు నష్టపోతూనే ఉంది. గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ ధరలు ఎలాంటి తగ్గుదల, పెరుగుదల లేకుండా నిలకడగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఒక ఔన్స్‌‌కు 1,952.11 డాలర్లుగా ఉంది. సిల్వర్ 0.8 శాతం తగ్గి ఒక ఔన్స్‌‌కు 27.30 డాలర్లుగా.. ప్లాటినమ్‌ 0.6 శాతం పెరిగి 934.29 డాలర్లుగా నమోదైంది. డాలర్ ఇండెక్స్ 0.2 శాతం తగ్గి వారం కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పీచ్‌పై గోల్డ్ ట్రేడర్లు ఎక్కువగా దృష్టిసారించారు. ఈ వైరస్ సంక్షోభ సమయంలో బ్యాంక్ అమెరికాకు ట్రిలియన్ డాలర్ల సపోర్ట్ అందించింది. ఇదే సమయంలో ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్‌‌పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ 0.3 శాతం పెరిగి 1,252.09 టన్నులకు చేరాయి.

For More News..

రూపాయికి జోష్.. 20 నెలల్లో ఎన్నడూ లేనంత పైకి

పెద్ద జాబ్స్ చేసేటోళ్లకే… ఎక్కువ టెన్షన్

కిరాయికి మారుతి కారు.. నెలకు ఎంతంటే?