నిప్పుతో గేమ్సా?.. దీదీకి గవర్నర్ వార్నింగ్

నిప్పుతో గేమ్సా?.. దీదీకి గవర్నర్ వార్నింగ్

కోల్‌‌కతా: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్ దాడికి గురైన సంగతి తెలిసిందే. బెంగాల్‌‌లో గురువారం నడ్డా కాన్వాయ్ పై కొందరు రాళ్లు రువ్వారు. రాళ్లు విసిరింది తృణమూల్ కాంగ్రెస్ నేతలే అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర బలగాలు కాపలాగా ఉన్న టైమ్‌‌లో దాడి ఎలా జరుగుతుందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆమె వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌‌ఖర్ సీరియస్ అయ్యారు. మేడమ్ దయచేసి నిప్పుతో ఆటలాడొద్దు అంటూ మమతా బెనర్జీకి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు.

‘జేపీ నడ్డా కాన్వాయ్ పై గురువారం జరిగిన దాడి దురదృష్టకరం. ఆ ఘటనతో నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా. నాకు సిగ్గుచేటుగా అనిపించింది. పాలనలో ఇదో బాధాకరమైన రోజు. ఈ విషయంపై సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్స్‌‌ సరికాదు. దేశ చట్టాలను, రాజ్యాంగాన్ని, గొప్ప బెంగాల్ సంస్కృతిపై విశ్వాసం ఉంచే బాధ్యతాయుత సీఎం ఇలా మాట్లాడతారా? నేను ఆమెకు ఓ విషయం అప్పీల్ చేస్తున్నా.. మేడం, దయచేసి గౌరవంగా వ్యవహరించి మీరు చేసిన కామెంట్స్‌‌ను వెనక్కి తీసుకోండి. భారత్ ఒక దేశం, భారతీయులందరూ ఒక్కటే. దయచేసి చిచ్చు పెట్టకండి. రాజ్యాంగం కిందే మీరూ పని చేస్తున్నారు. దాన్ని గౌరవించండి. ఎవరు బయటివాళ్లు? ఎవరు లోపలి వ్యక్తులు? ఇలాంటి స్టేట్‌‌మెంట్స్‌తో విద్వేషాలను వ్యాప్తి చేయకండి’ అని జగ్దీప్ కోరారు.