
- హాజరైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు
- అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన
కరీంనగర్, వెలుగు:అధికారంలోకి రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పలువురు కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్ , ఏఐసీసీ ఇన్ చార్జీని కోరారు. గంగాధర మండలం వెంకటయ్యపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ తో పాటు కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు ఎవరికి వస్తున్నాయో? గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియడం లేదని, నాయకులు, కార్యకర్తల ద్వారా సంక్షేమ పథకాలు చేరినప్పుడే ప్రజల దగ్గరికి వెళ్లి మళ్లీ ఓట్లు అడగగలుగుతామని వెల్లడించారు. పార్టీలో కొత్త వాళ్లకు ప్రాధాన్యమిస్తున్నారని, పాత వాళ్లకు సముచిత స్ధానం కల్పించాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ కు ఏదైనా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని ఆ నియోజకవర్గ నాయకులు కోరారు. స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు డేట్ అయిపోయాక ఇచ్చి గవర్నమెంట్ ను బద్నామ్ చేస్తున్నాడని, నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రణవ్ కు ఏదైనా పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనుల సమాచారం తమకు ఉండడం లేదన్నారు. పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై కొత్తగా వచ్చిన వాళ్లు పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రతిపక్ష ఓటు బీజేపీ రూపంలో చీలడం వల్లనే కాంగ్రెస్ కొన్ని చోట్ల ఓడిపోయిందన్నారు. పదేళ్లు రాజ్యం చేసినోడు పార్టీలోకి వచ్చి నేను రాజ్యం చేస్తానంటే ఎలాగని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కోరుట్ల కాంగ్రెస్ ఇన్ చార్జి జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు లేని చోట ప్రోటోకాల్ సమస్య వస్తోందన్నారు. అధికారంలో ఉన్నా వేదికలు ఎక్కలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తేయాలని కోరారు. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కార్యకర్తల ద్వారానే తీసుకెళ్లాలని సూచించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వారిని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని కోరారు. కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉందని, జనహిత పాదయాత్రను కరీంనగర్ లో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని
కోరారు.