- కరీంనగర్ కలెక్టరేట్ వద్ద దళిత కుటుంబం ఆత్మహత్యాయత్నం ..
- అడ్డుకుని పురుగుల మందు డబ్బాలను లాక్కున్న పోలీసులు
కరీంనగర్, వెలుగు : భూమికి హద్దులు నిర్ణయించాలని లేదంటూ చనిపోతామని దళిత కుటుంబం పురుగుల మందు డబ్బాలతో వచ్చి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు అడ్డుకుని పురుగుల మందు డబ్బాలను లాక్కున్న ఘటన సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గన్నేరువరం మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు కొంపల్లి ఎల్లయ్య, రాములు, నర్సయ్య, వీరయ్యకు రెవెన్యూ సర్వే నంబర్ 178లో 2.09 గుంటల చొప్పున 8.36 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి.
అన్నదమ్ముల్లో ముగ్గురు ఉపాధి కోసం 40 ఏండ్ల కింద వేరే ప్రాంతానికి వలస వెళ్లడంతో భూములు పడావుగా ఉన్నాయి. వాటిని పక్కనే భూములున్న రైతులు ఆక్రమించుకున్నారు. కాగా.. మూడేండ్ల కింద తమ భూములను చూసేందుకు అన్నదమ్ములు రాగా.. ఇతరుల ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. సర్వే చేసి తమ భూములకు హద్దులు చూపాలని సర్వే డిపార్ట్ మెంట్ కు దరఖాస్తు చేశారు. '
మండల సర్వేయర్ సర్వే చేయగా.. ఆ భూములను ఆక్రమించిన వ్యక్తులు ఒప్పుకోలేదు. దీంతో రెండు నెలల కింద డీఐ సర్వే చేసినా హద్దులు నిర్ణయించలేదు. పంచనామా రిపోర్టు కూడా ఇవ్వలేదు. దీంతో కలెక్టర్, ఆర్డీఓ చుట్టూ తిరిగి విసిగిపోయిన కొంపల్లి రాములు కుటుంబ సభ్యులు సోమవారం ప్రజావాణి కార్యక్రమం వద్దకు పురుగు మందు డబ్బాలతో వచ్చారు. సర్వే చేయకుంటే చనిపోతామని పురుగుల మందు తాగేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకుని డబ్బాలను లాక్కున్నారు.
