
తీవ్ర వైకల్యం అనేది సాధారణ వైకల్యం కంటే మరింత సవాళ్లతో కూడిన స్థితి. వీరికి నిత్య జీవితంలో ఉజ్జీవంగా ఉండేందుకు, చలనం, సంభాషణ, అభిప్రాయం, విద్య, వైద్యం, జీవనోపాధి, రవాణా వంటి అంశాల్లో శాశ్వతంగా ఇతరుల సహాయ సహకారాలు అవసరం. వీరిని ‘అధిక మద్దతు అవసరం గల వ్యక్తులు’ అనే విభాగానికి చెందినవారు.
దివ్యాంగుల హక్కుల చట్టం 2016లో సెక్షన్ 2 (టి) ప్రకారం ‘పరిమితి లేని ఆధారాలు అవసరమయ్యే దివ్యాంగులు’ అనే నిర్వచనంలో అధిక మద్దతు అవసరం గల వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. కానీ, అమలు మాత్రం వేదికలపై కేవలం మాటలకే పరిమితమైపోయింది.
వ్యక్తిగత సహాయ సంరక్షణ తీసుకునే వ్యక్తి సాయంపై ఆధారపడే జీవితం. స్వయం నియంత్రణ లేకుండా ఆధారపడిన జీవితం. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్కీములు లేకపోవడం. ఆసరా లేదా ఇతర పింఛన్లలో తక్కువ మొత్తాలు సరిపోకపోవడం. ఆరోగ్యంపై అధిక ఖర్చులు, ఉచిత వైద్యం దూరమై కలగా మారడం. యుడిఐడి కార్డుల్లో అధిక మద్దతు అవసరం గల వారి ప్రామాణీకరణ లేదు. ప్రత్యేక బడ్జెట్ మంజూరులు లేవు.
తెలంగాణలో తీవ్ర వైకల్యం కలిగినవారి పరిస్థితి
తెలంగాణలో దాదాపు 20,000 మంది దివ్యాంగులలో 5,000 మంది తీవ్రమైన వైకల్యంతో, శాశ్వత సంరక్షణ అవసరంతో జీవిస్తున్నారు. వీరిలో చాలామంది వెన్నెముక గాయ, మస్తిష్క పక్షవాతం, బహుళ స్కిరోసిస్, కండరాల క్షీణత లాంటి పూర్తిగా మంచాన పడే పరిస్థితులు ఉన్నవారు. ఈ స్థితిలో కూడా వీరికి ప్రత్యేకంగా గృహవసతి, మెరుగైన పింఛన్, సంరక్షణ సేవలు, మానసిక ఆరోగ్య సేవలు వంటి అంశాలు మరుగునపడిపోయాయి.
తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అధిక మద్దతు అవసరం గల వర్గంగా గుర్తించి, వారి కోసం ప్రత్యేక శ్రేణిలో పథకాలు అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక విధానం లేదు.
ఎలా ఉండాలి ప్రభుత్వ విధాన దృష్టి?
అధిక మద్దతు అవసరం గల వారి గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించాలి. యుడిఐడి కార్డులలో “అధిక మద్దతు అవసరం గల” వారి విభాగాన్ని ప్రవేశపెట్టాలి. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అర్హులను గుర్తించి ప్రత్యేక పింఛన్ పథకం ద్వారా రూ. 15000 వరకు పెంచి మంజూరు చేయాలి. మానసిక వ్యక్తిగత సహాయభత్యం ఇవ్వాలి.
స్వయం ఆధారంగా జీవించే పథకాలు. ఇంటి ఆధారిత ఫిజియోథెరపీ, నర్సింగ్, కౌన్సెలింగ్ సేవల మంజూరు. ఇంటి వద్ద ఉపాధి మార్గాలు (వర్క్ ఫ్రం హోమ్ స్కీమ్) ప్రత్యేక హాస్టల్స్/సదుపాయ కేంద్రాలు జిల్లాలవారీగా అధిక మద్దతు అవసరం గల కోసం దిన సంరక్షణ, నివాసిత కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలి.
సమాజ బాధ్యత – కేవలం ప్రభుత్వం మీదే కాదు
ప్రభుత్వం తన పాత్రను నిబద్ధతగా నిర్వర్తించాల్సిన సమయమిది. అదే సమయంలో సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, స్థానిక నాయకులు కూడా ఈ వర్గాన్ని మరిచిపోవద్దు. తెలంగాణ వెన్నె ముక గాయ వికలాంగుల సంఘం వంటి వాటికి సామాజిక మద్దతు అవసరం. ఒక సమాజం నిజమైన అభివృద్ధి, ఆ సమాజం అత్యంత వెనుకబడిన వర్గాన్ని ఎలా గౌరవిస్తుందో దానిపై ఆధారపడి ఉంటుంది.
తీవ్రమైన వైకల్యం కలిగినవారు మన కుటుంబ సభ్యులే. వారికోసం చట్టాలున్నాయి. కానీ వాటిని జీవన సత్యాలుగా మార్చడానికి మనందరం కలిసి ముందుకు రావాలి. మనమంతా కలిసే తోడ్పాటు ఇవ్వగలిగితేనే తీవ్ర వైకల్యం ఉన్నవారికి జీవితం ఒక గౌరవప్రదమైన హక్కుగా మారుతుంది.
- ఎం.డి. షఫీ అహ్మద్ ఖాన్–