పీఎం కిసాన్ పింఛన్: రైతుల వాటా నెలకు రూ.100

పీఎం కిసాన్ పింఛన్: రైతుల వాటా నెలకు రూ.100

ప్రధానమంత్రి రైతు పింఛన్ పథకం కింద లబ్ధి పొందేందుకు రైతులు నెలకు 100 రూపాయలు  తమ వంతుగా జమచేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో వారికి 60 ఏళ్ల నుంచి నెలకు కనీసం రూ.3000 పింఛన్ అందుతుందని కేంద్రం స్పష్టం చేసింది. LIC నిర్వహించే ఈ పింఛన్ ఫండ్‌లో కేంద్రం కూడా రూ.100 జమ చేస్తుంది.

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం ప్రత్యేక పింఛన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద మొదటి మూడేళ్లలో 5 కోట్ల మంది రైతులకు లబ్ధిచేకూర్చేందుకు ప్రభుత్వంపై ఏడాదికి రూ.10,774 కోట్ల భారం పడనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం కోసం 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న రైతుల వివరాలు నమోదు చేయాలన్నారు. అంతేకాదు పథకం పట్ల రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.

మరోవైపు ప్రధాన మంత్రి కిసాన్ పథకం నమోదును వేగవంతం చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులను కోరారు. మూడు విడుతల్లో రూ.2,000 చొప్పున ఏడాదికి రూ.6,000 సకాలంలో రైతులకు చెల్లించేందుకు అర్హులైన వారి వివరాలను సకాలంలో పంపాలన్నారు. ఏప్రిల్-జూలై మధ్య రూ.2,000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తొలి విడుత 3.3 కోట్ల మంది రైతులు, రెండో విడుతలో 2.7 కోట్ల మంది రైతులకు నగదు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.87,000 కోట్ల ఖర్చు కానుందన్నారు. రైతు రుణ కార్డు పథకం కింద 100 రోజుల్లో కోటి మంది రైతులు నమోదయ్యేలా గ్రామస్థాయిలో ప్రచారం చేసి అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించారు.