226జిల్లాల్లో నీళ్లు లెవ్వు: ప్రధాని మోడీ

226జిల్లాల్లో నీళ్లు లెవ్వు: ప్రధాని మోడీ

జలశక్తి ద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: నీళ్ల సమస్య నుంచి దేశం బయటపడాల్సిన అవసరముందని, అదే టైమ్​లో నీటి వాడకంపై ప్రజల్లో అవగాహన పెరగాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో దేశవ్యాప్తంగా 226 జిల్లాల్లో నీళ్ల కరువు తీవ్రంగా ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా చేపట్టే పనుల్లో నీటి వసతికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వాటర్​ క్రైసిస్​ను అధిగమించడంలో ప్రభుత్వానికి అన్ని పార్టీలూ సపోర్ట్​ చేయాలని కోరారు. ముందు తరాలు బాగుండాలంటే, నీటి సమస్యపై ఫోకస్​ పెట్టాల్సిందేనన్న ప్రధాని.. కొత్తగా ఏర్పాటు చేసిన జల శక్తి మంత్రిత్వ శాఖ ముఖ్య ఉద్దేశం అదేనని,  పనులు వేగవంతమయ్యేలా నీళ్లకు సంబంధించిన అన్ని వ్యవహారాల్ని ఒక గొడుగు కిందికి తెచ్చామని వివరించారు. ఇవికాకుండా, డెవలప్​మెంట్​కు దూరంగా ఉండిపోయిన మరో 120 జిల్లాల్ని గుర్తించామని, వాటిని యావరేజ్​ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై థ్యాంక్స్​ చెప్పే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. సంచలనం రేపిన జార్ఖండ్​ మాబ్​ లించింగ్​, బీహార్​ మెదడువాపు మరణాలపైనా ప్రధాని స్పందించారు. ప్రతిపక్ష కాంగ్రెస్​పై మరోసారి ఎదురుదాడి చేశారు.

మెదడువాపు.. మాబ్​ లించింగ్​
బీహార్​లో మెదడువాపు వ్యాధి బారిన పడి దాదాపు150 మంది చిన్నారులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పీఎం మోడీ మాట్లాడుతూ.. ‘‘పిల్లల మరణాలు నాతో పాటు ప్రతి ఒక్కరినీ బాధించాయి. నిజంగా దేశం సిగ్గుపడాల్సిన సందర్భమిది. గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. బీహార్​ సీఎం, మంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా. టీకాలు, వ్యాక్సిన్లు, ట్యాబ్లెట్లతోపాటు పౌష్టికాహారం అందించే పని వేగంగా సాగుతోంది. మెదడువాపు వ్యాధిని అరికట్టడంలో యూపీ సర్కార్​ చేపట్టిన పనులు సక్సెస్​ అయ్యాయి. అదేటైమ్​లో ఆయుష్మాన్​ భారత్​కు మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరముంది’’అని అన్నారు. జార్ఖండ్​లో మాబ్​ లించింగ్​ మర్డర్​పైనా మోడీ స్పందించారు. ఒక్క సంఘటనకు మొత్తం రాష్ట్రాన్ని నిందించడం కరెక్ట్​ కాదన్నారు. యువకుడి(తబ్రేజ్​ అన్సారీ) హత్య అందర్నీ కలవరపెట్టింని, దోషుల్ని కఠినంగా శిక్షిస్తామన్న మోడీ, ఒక్క నేరానికి రాష్ట్రాన్ని బద్నాం చేసే హక్కు ఎవరకీ లేదన్నారు. ఇలాంటి విషయాల్లో పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు పోవద్దని, పౌరుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడిఉందని ఉద్ఘాటించారు.

కాంగ్రెస్​ ఓడిపోతే దేశం ఓడినట్లా?

లోక్​సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్​ నేతలు.. ప్రజాతీర్పును అవమానించేలా మాట్లాడుతున్నారని మోడీ మండిపడ్డారు. ‘‘ఓటర్లు వన్​సైడ్​ తీర్పిచ్చారు. బీజేపీ గెలుపుని దేశం ఓటమిగా, ప్రజాస్వామ్యం ఓటమిగా కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. వాళ్ల ఉద్దేశంలో దేశమంటే ఒక్క కాంగ్రెస్​ పార్టీ అనేనా? వయనాడ్​, రాయ్​బరేలీలో కూడా దేశం ఓడినట్లా? అహంకారానికీ ఓ హద్దుండాలి. ఈవీఎంలు,ఈసీపైనా విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు.. వేర్వేరు రాష్ట్రాల్లో వాళ్లు గెల్చినప్పుడు మాత్రం నోరు తెరవరు. ఈవీఎంలపై ఈసీ చర్చకు ఆహ్వానిస్తే రెండు పార్టీలు తప్ప మిగతావాళ్లు రానేలేదు. మేం దేశాన్ని ముందుకు తీసుకెళుతుంటే, కాంగ్రెస్​ మాత్రం పాత రోజులు కావాలంటోంది. మైండ్​సెట్​లో తేడా ఉంది కాబట్టే ఇవాళ 17 రాష్ట్రాల్లో  కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఆ పార్టీ పరిస్థితి దుమ్ముపట్టిన ముఖాన్ని వదిలేసి, అద్దాన్ని తుడ్చుకున్నట్లుగా తయారైంది. ఒకప్పుడు బీజేపీకి ఇద్దరే ఎంపీలున్నారు. చాలా మంది మమ్మల్ని చూసి నవ్వేవాళ్లు. అయినాసరే కష్టపడ్డాం. ప్రజల హృదయాలు గెల్చుకోగలిగాం. ఎన్నికల విధానంపై, ఈవీఎంలపై బీజేపీ ఏనాడూ చిల్లర విమర్శలు చేయలేదు”అని పీఎం మోడీ అన్నారు.

ఆ జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు
జులై 1 నుంచి జల శక్తి అభియాన్​ క్యాంపెయిన్

న్యూఢిల్లీ: నీళ్ల సమస్య తీవ్రంగా ఉన్న జిల్లాల్లో చేపట్టాల్సిన పనులపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్​ పెంచింది. ‘సెంట్రల్​ ప్రభారీ ఆఫీసర్​’ పేరుతో జిల్లాలకు ప్రత్యేక ఇన్​చార్జిలను నియమించింది. జులై 1 నుంచి ప్రారంభం కానున్న జల శక్తి అభియాన్​కోసం డైరెక్టర్​, అడిషనల్​, జాయింట్​ సెక్రటరీ స్థాయిలో పనిచేస్తున్న ఆఫీసర్లను కేటాయించినట్లు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ బుధవారం ప్రకటించింది. ఒక్కో ఇన్​చార్జి కింద గ్రౌండ్​ వాటర్​ సైంటిస్టులు, ఇంజనీర్లతో కూడిన బృందం ఉంటుందని, ఆయా బృందాలు నేరుగా జిల్లాల్లో పర్యటించి, నీటి వనరులు, వాటి పరిరక్షణా విధానాల్ని పరిశీలించి రిపోర్టు తయారుచేస్తాయని పర్సనల్​ శాఖ వెల్లడించింది. రూరల్​ ఏరియాలో జల సంక్షణ, నీటిపారుదల, సాగు సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రధాని సూచనమేరకు ‘జేఎస్​ఏ’ పేరుతో టైమ్​బౌండ్​ ప్రోగ్రామ్​ రూపొందించింది. ​ జులై 1న మొదలయ్యే జేఎస్​ఏ క్యాంపెయిన్ సెప్టెంబర్​ 15 వరకు, కొన్ని జిల్లాల్లో నవంబర్​ దాకా కొనసాగనుంది.