ఐదేండ్ల రోడ్ మ్యాప్ రెడీ చేయండి : ప్రధాని మోదీ

ఐదేండ్ల రోడ్ మ్యాప్ రెడీ చేయండి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ సర్కార్ అధికారంలో వస్తుందన్న ధీమాలో ప్రధాని మోదీ ఉన్నారు. పవర్​లోకి వచ్చిన తర్వాత రానున్న ఐదేండ్లలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రులను మోదీ ఆదేశించినట్టు సమాచారం. అదేవిధంగా, తొలి వంద రోజుల్లో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన డ్రాఫ్ట్​ను కూడా రెడీ చేయాల్సిందిగా సూచించినట్టు తెలిసింది.

జూన్ 4న ప్రకటించే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం కేబినెట్ భేటీ అయినట్టు తెలుస్తున్నది. ఎజెండా అంశాలపై చర్చించడానికి మంత్రులందరూ తమ తమ శాఖ కార్యదర్శులతో భేటీ కావాల్సిందిగా మోదీ సూచించినట్టు సమాచారం. అదేవిధంగా, ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించి పెట్టుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తున్నది.

కాగా, మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతుందనే దానిపై ఇప్పటికే మోదీ పలుమార్లు వివరించారు. ఇండియాను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మారుస్తామని తెలిపారు. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ డెవలప్​మెంట్, సప్లై చైన్ కంట్రోల్​తో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు.

మూడోసారి మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని గత నెలలో జరిగిన లోక్​సభ సెషన్ లోనూ ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ పరంగా ఇండియా ఇప్పుడు ఐదో స్థానంలో ఉందని, తాము అధికారంలోకి వచ్చాక మూడో స్థానానికి తీసుకొస్తామని చెప్పారు. మూడో టర్మ్​లో నారీ శక్తి కూడా పెరుగుతుందని ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ వివరాలను కేబినెట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపింది. బీజేపీకి కనీసం 370 స్థానాలు వస్తాయని, ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని మోదీ అంచనా వేస్తున్నారు.