
- గగన్ యాన్ ప్రాజెక్టుకు ఎంపికైన వాళ్లతో ప్రధాని మోదీ
- విక్రమ్ సారాభాయ్ సెంటర్లో గగన్ యాన్పై రివ్యూ
- 2040 నాటికి చంద్రుడిపైకి తొలి ఇండియన్
తిరువనంతపురం: భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ మిషన్ కోసం ఎంపిక చేసిన నలుగురు ఆస్ట్రోనాట్ల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఈ మిషన్ కు ఎంపికయ్యారని వెల్లడించారు. మంగళవారం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని స్వయంగా గగన్ యాన్ ఆస్ట్రోనాట్లను దేశ ప్రజలకు పరిచయం చేశారు. వారి ఛాతీలపై ఆస్ట్రోనాట్ బ్యాడ్జిలను స్వయంగా గుచ్చి ధరింపచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ నలుగురూ కేవలం నాలుగు పేర్లు కాదు. నలుగురు వ్యక్తులు కాదు. నాలుగు శక్తులు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, స్వప్నాలను అంతరిక్షానికి మోసుకుపోయే ప్రతినిధులు” అని మోదీ కొనియాడారు. ఈ నలుగురూ ఎంతో డెడికేషన్‌తో ట్రెయినింగ్ పూర్తి చేశారని తెలిపారు. ‘‘దాదాపు 40 ఏండ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు. ఈ సారి కౌంట్ డౌన్ మనదే. రాకెట్ కూడా మనదే” అని ప్రకటించారు. గగన్ యాన్ మిషన్‌లో మెజారిటీ పరికరాలు మన దేశంలో తయారైనవేనని మోదీ చెప్పారు. చంద్రయాన్, గగన్ యాన్ మిషన్లలో మహిళా సైంటిస్టుల పాత్ర కీలకమన్నారు.
2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్
భారత్ కు 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ సమకూరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. సొంత స్పేస్ స్టేషన్ తో అంతరిక్షంపై పరిశోధనలు జరుగుతాయన్నారు. ఇదే అమృతకాలంలో 2040 నాటికి సొంత రాకెట్ ద్వారానే చంద్రుడిపైకి తొలి భారతీయుడు అడుగుపెడతాడని, అక్కడి నుంచి శాంపిల్స్ తీసుకొస్తాడన్నారు. 21వ శతాబ్దంలో ఇండియా సత్తాను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. 2014కు ముందు 33 శాటిలైట్లను మాత్రమే ప్రయోగించగా.. గత పదేండ్లలో ఏకంగా 400 శాటిలైట్లను అంతరిక్షానికి పంపామన్నారు. అంతకుముందు గగన్ యాన్ మిషన్ పై ఇస్రో సైంటిస్టులతో ప్రధాని మోదీ రివ్యూ చేశారు. ఇస్రో ఆధ్వర్యంలో రూ. 1,800 కోట్లతో చేపట్టిన మూడు స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఇందులో ఎస్ఎల్ వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (శ్రీహరికోట, ఏపీ), సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ (మహేంద్రగిరి, తమిళనాడు), ట్రైసోనిక్ విండ్ టన్నెల్ (తిరువనంతపురం, కేరళ) ప్రాజెక్టులు ఉన్నాయి.
2024 చివర్లో లేదా 2025 మొదట్లో మిషన్
భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ మిషన్‌ను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. మిషన్‌లో భాగంగా ముగ్గురు ఆస్ట్రోనాట్ లను అంతరిక్షానికి పంపనుంది. భూమికి 400 కి.మీ. ఎత్తులోని కక్ష్యలో వీరు మూడు రోజుల పాటు గడపనున్నారు. ఆ తర్వాత వారిని క్రూ మాడ్యూల్ ద్వారా సేఫ్‌గా భూమికి తిరిగి తీసుకొస్తారు. సముద్రంలో దిగే మాడ్యూల్‌ను రికవరీ చేసుకుని, ఆస్ట్రోనాట్లను క్షేమంగా బయటకు తీసుకొస్తారు. ఈ మిషన్ కోసం ఎల్వీఎం3(లాంచ్ వెహికల్ మార్క్ 3) రాకెట్ ను వినియోగించనున్నారు. మిషన్ కు సంబంధించి ఇప్పటికే పలు ముందస్తు ప్రయోగాలు పూర్తయ్యాయి.
కేరళలో శత్రువులు.. బయట దోస్తులు
తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన బీజేపీ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలోనూ మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కేరళలో బద్ధ శత్రువులుగా ఉంటాయని, కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బీఎఫ్ఎఫ్ (బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్)లు అన్నట్టుగా ఉంటాయని ఎద్దేవా చేశారు. ‘‘కమ్యూనిస్ట్ సీఎం పినరయి విజయన్ అవినీతిపరుడని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దానికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ కార్యకర్తలపై కమ్యూనిస్టు ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయిస్తుంది. అయినా సరే.. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఆ రెండు పార్టీల నేతలు కలిసి కూర్చుని సమోసాలు, బిస్కట్లు తిని, టీ తాగుతారు” అని మోదీ విమర్శించారు.
తమిళనాడులో ఘన స్వాగతం
తమిళనాడులో ప్రధాని మోదీకి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పార్టీ స్టేట్ చీఫ్ కె.అన్నామలై యాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం తిరుపూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఓపెన్ వెహికల్లో ర్యాలీగా సభా వేదిక వద్దకు బయలుదే రిన మోదీకి కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపిస్తూ వెల్ కం చెప్పారు. భారత్ మాతా కీ జై, వియ్ వాంట్ మోదీ, వన్స్ అగైన్ మోదీ అంటూ నినాదాలు చేశారు.