న్యాయం కోసం బాధితులు చాలాకాలం ఎదురుచూడాల్సి వస్తోంది : ప్రధాని మోడీ

న్యాయం కోసం బాధితులు చాలాకాలం ఎదురుచూడాల్సి వస్తోంది : ప్రధాని మోడీ

న్యాయ శాఖ మంత్రులు, సెక్రటరీల కాన్ఫరెన్స్​లో ప్రధాని మోడీ

కేవడియా: వేగంగా సమస్యలు పరిష్కరించే న్యాయవ్యవస్థ సమాజానికి అత్యంత ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ మన దేశంలో న్యాయం దక్కడం చాలా ఆలస్యమవుతోందని అన్నారు. న్యాయం కోసం బాధితులు చాలాకాలం ఎదురుచూడాల్సి వస్తోందని, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద చాలెంజ్​లలో ఇదొకటని ఆయన వివరించారు. గుజరాత్​లోని  కేవడియాలో  నిర్వహిస్తున్న రెండు రోజుల ‘ఆల్ ఇండియా లా మినిస్టర్స్, లా సెక్రటరీస్​ కాన్ఫరెన్స్​’ ను ప్రధాని వర్చువల్​గా ప్రారంభించారు. తర్వాత ఆయన వీడియో మెసేజ్​ను ప్రదర్శించారు. సామాన్యులు అర్థం చేసుకోలేని భాషలో రాసిన చట్టం సంక్లిష్టతను సృష్టిస్తుంది, కనుక ఇకపై చేసే కొత్త చట్టాలను సులభమైన రీతిలో ప్రాంతీయ  భాషలలో రాయాలన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలంతా వాటిని అర్థం చేసుకునేలా ఉండాలన్నారు. న్యాయవ్యవస్థలో అర్థంకాని భాష ప్రజలకు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు. లోక్​అదాలత్​లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు కోర్టులపై భారాన్ని తగ్గించడంతోపాటు పేదలు సులభంగా న్యాయం పొందేందుకు ఉపయోగపడుతున్నాయిని చెప్పారు.

ప్రాంతీయ భాషలతో సులభంగా న్యాయం

లీగల్​ సిస్టమ్​లో ప్రాంతీయ భాషల వినియోగం సులభంగా న్యాయం అందరడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని తెలిపారు. సామాన్యులు సైతం సులువుగా అర్థం చేసుకునేలా చేయగలిగితే దాని ప్రభావం భిన్నంగా ఉంటుందన్నారు. కొన్ని దేశాల్లో కొత్తగా ఒక చట్టం చేసేప్పుడు దాన్ని రెండు రకాలుగా నిర్ణయిస్తారన్నారు. సాంకేతిక భాషలో దాని రూల్స్​ను డిటైల్డ్​గా వివరించడంతోపాటు సామాన్యులకు అర్థమయ్యేలా ప్రాంతీయ భాషలలో రాస్తారని చెప్పారు.