గుజరాత్ ఎన్నికలు 25 ఏండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తయ్ : మోడీ 

గుజరాత్ ఎన్నికలు 25 ఏండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తయ్ : మోడీ 

పాలన్ పూర్: గుజరాత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. 25 ఏండ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం బనాస్​కాంత జిల్లాలోని పాలన్ పూర్, ఆరావళి జిల్లాలోని మోదస టౌన్ లో మోడీ ప్రచారం చేశారు. ‘‘ఈ ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనేది కాదు.. ఇవి 25 ఏండ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయి” అని ఆయన అన్నారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశాం. ఇప్పుడు మరింత ఎత్తుకు ఎదగాల్సిన టైమ్ వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలతో గుజరాత్ పోటీ పడేలా కృషి చేస్తున్నాం” అని అన్నారు. ‘‘రాష్ట్ర ప్రజలు తమ సమస్యలను నాకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే నేనిక్కడే పుట్టి పెరిగాను. నాకు ఇక్కడి సమస్యలు తెలుసు. అవన్నీ పరిష్కరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మీ సహకారం కావాలి. మళ్లీ బీజేపీని గెలిపించండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

కాంగ్రెస్, ఆప్ పై విమర్శలు.. 

కాంగ్రెస్, ఆప్ పై మోడీ విమర్శలు చేశారు. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అంటూ ఆ పార్టీలు ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ.. ‘‘ఇది కరెంట్ ఫ్రీగా ఇవ్వాల్సిన సమయం కాదు. కరెంట్ నుంచి ఆదాయం రాబట్టాల్సిన టైమ్. అదెలాగో నాకు మాత్రమే తెలుసు” అని అన్నారు. ‘‘రాష్ట్రంలోని మొధేరా గ్రామం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. అక్కడ మొత్తం సోలార్ రూఫ్ టాప్ ల ద్వారానే కరెంట్ అందుతోంది. అక్కడి ప్రజలు తమకు అవసరమైన కరెంట్ వాడుకొని, మిగతాది ప్రభుత్వానికి అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. ఇది రాష్ట్రమంతా అమలు చేయాలన్నదే నా లక్ష్యం” అని చెప్పారు. ‘‘కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలని రైతులు ఆందోళన చేస్తే వాళ్లను పోలీసులు కాల్చి చంపారు. కానీ ఇప్పుడు రైతులే సొంతంగా సోలార్ ప్యానెళ్ల ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు” అని తెలిపారు.