
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఇటు బీజేపీలో అటు సంఘ్ పరివార్‌లో దుమారం లేపినాయి. అయితే మోహన్ భగవత్ నాగపూర్ వేదికగా 75 ఏళ్ల నాయకులకు విశ్రాంతి అవసరం అని చెప్పిన నేపథ్యంలో మోదీ ప్రధానిగా కొనసాగే కాలంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ ఎస్ కన్నా ఎవరూ ఎక్కువ కాదని సంఘ్ చెప్పడం కూడా జరిగింది. ఎర్రకోట నుంచి మోదీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తావన వెనక తనను తాను కాపాడుకునే రాజకీయ వ్యూహమా? భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఎప్పుడూ ఒక రాజకీయ, సిద్ధాంతపర, జాతీయ దిశను సూచించే వేదికగా ఉంటుంది, ఉండాలి. అయినా చాలాసార్లు రాజకీయ ప్రసంగాలు చేస్తూ చులకన అవుతున్నాడు. అలాంటి వేదికపై ఆర్‌ఎస్‌ఎస్ కు ప్రశంసలు కురిపించడం ఒక యాదృచ్ఛికం కాదని, మోహన్ భగవత్ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి మాత్రమే అని ట్రోల్ జరిగిన సందర్భంలో ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం పార్టీలో అంతర్గత పోరు మొదలైందనే ప్రచారమూ ఉంది.
రాబోయే ఎన్నికల సందర్భంలో, హిందూ జాతీయవాద భావజాలాన్ని మరింత మద్దతుగా నిలబెట్టుకోవడం ప్రధాన ఉద్దేశం. ఇలాంటి ధోరణి ఎంతవరకు రాజ్యాంగబద్ధం అన్నది ప్రధాన ప్రశ్న. రాజ్యాంగం ఒక సెక్యులర్ దేశాన్ని ప్రతిపాదిస్తే, ప్రధాన మంత్రి ఒక ప్రత్యేక సిద్ధాంతానికి మద్దతుగా నిలబడటం .. జాతిస్ఫూర్తికి విరుద్ధమని విమర్శకులు పేర్కొంటున్నారు. ఎర్రకోట నుండి దేశ ప్రజలందరికీ ప్రసంగించే నాయకుడు ఒక మత, ఒక వర్గ ఆధారిత సంస్థను ప్రోత్సహిస్తే, అది ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీసే చర్య అవుతుంది. విభిన్నతను గౌరవించే బదులు, ఒకే దిశలోని సిద్ధాంతాన్ని దేశవ్యాప్తం చేయాలనే ప్రయత్నం. ఇది సరైన ధోరణి కాదు. తాను దైవాంశ సంబూతుడిని అని మోదీ ఒకసారి ప్రకటించుకోవడం.. దానిని ఆర్ఎస్ఎస్ అధినాయకత్వం తీవ్రంగా ఖండించడం మనకు తెలిసిందే. రాజకీయ లెక్కలు మాత్రమే మోడీ తో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నాయా? ఎర్రకోటకు ఒక చరిత్ర ఉంది, అక్కడ చేసిన ప్రసంగాలకు అద్భుతమైన ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ ప్రస్తావించే సంస్థలు లేదా నాయకులు జాతీయ గుర్తింపుగా పరిగణించబడతారు. అలాంటి సందర్భంలో ఒక పార్టీకి అనుబంధంగా, ఒక వర్గానికి ప్రాతినిధ్యంగా కనిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించడం, దేశాన్ని సమగ్రత వైపు కాకుండా విభజన వైపు నడిపిస్తుందనే ఆందోళన అందరిలో ఉంది.
ఇరకాటంగా పడేసిన రాహుల్ బాంబు
ఆర్‌ఎస్‌ఎస్ తనను తాను దేశభక్తి, సేవాభావం, సంస్కృతి రక్షణతో అనుసంధానించుకోవాలని ప్రయత్నించినా, దాని చరిత్రలో ముస్లిం వ్యతిరేకత, మైనారిటీల పట్ల అనుమానాస్పద దృక్కోణం, గాంధీ హత్యతో ఉన్న బంధం వంటి అంశాలు ఉన్నాయి. అలాంటి సంస్థను జాతీయ వేదికపై మహోన్నతంగా చూపించడం ద్వారా, మోదీ భారతదేశాన్ని బహుళత్వానికి కాకుండా హిందూత్వ భావజాలానికి కట్టిపడేస్తున్నాడనే విమర్శ వస్తోంది. ప్రధాని మోదీ ప్రభుత్వానికి జనాదరణ అందించిన తీవ్ర జాతీయవాదం ఒకటి అయితే, 'ఆపరేషన్ సిందూర్' మోదీ గ్రాఫ్ ను అమాంతం పెంచింది. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పేల్చిన ఆటంబాంబు మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలకు వ్యతిరేకంగా రాహుల్ 'ఓట్ అధికార్ యాత్ర' మోదీ గుండెల్లో దడదడ పెట్టిస్తోంది. అందుకే మోదీ ప్రధానిగా తొలిసారిగా ఆర్ఎస్ఎస్‌ను ‘ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్‌జిఒ’ అని అభివర్ణిస్తూ ఎర్రకోట నుంచి కీర్తించడం వేడుకోలు లాంటిదే! దేశ రాజకీయాల్లో మోహన్ భగవత్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించినా ఆర్ఎస్ఎస్ , బీజేపీ బంధం మనిషి దేహం, ఆత్మలాంటిదే. మోహన్ భగవత్ అన్న మాటలు ఆషామాషీ కాదు, పరిగణనలోకి తీసుకుంటే ఈ సంవత్సరం పదవీ విరమణ తప్పదనే భావన ఏర్పడింది. అది ఏమేరకు నిజం కానుందో రాబోయే కాలమే చెప్పనుంది.
- డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి,
జర్నలిజం శాఖ,
కాకతీయ యూనివర్సిటీ