పాక్​పై మా వైఖరి మారలే: మోడీ

పాక్​పై మా వైఖరి మారలే: మోడీ

కిర్గిస్థాన్ లో ని బిష్కెక్ లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సమ్మిట్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తనకు మెసేజ్ చేసిన జిన్​పింగ్ కు మోడీ థాంక్స్ చెప్పారు. పాకిస్థాన్ టెర్రరిజంపై ఇరు దేశాల నేతలు చర్చించారు. టెర్రరిజాన్ని అరికట్టేందుకు పాకిస్థాన్ చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ తో స్నేహం విషయంలో ఇండియా వైఖరిలో మార్పులేదని మోడీ స్పష్టం చేశారు.

జైషే చీఫ్​ మసూద్​ అజార్​ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడంపై మోడీ, జిన్ పింగ్ చర్చించారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఈ ఏడాది ఇండియాలో.. చైనా ప్రెసిడెంట్ జిన్​పింగ్ పర్యటించనున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో మోడీ భేటీ అయ్యారు. అమేథీలో రైఫిల్ తయారీ యూనిట్ కు రష్యా సహకారం అందించడంపై పుతిన్​కు ధన్యవాదాలు చెప్పారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో గురు, శుక్రవారాల్లో జరగే ఎస్పీవో సమ్మిట్​కు హాజరయ్యేందుకు బిష్కెక్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిర్గిస్థాన్ దేశపు స్వీట్లను ప్రధాని మోడీ టేస్ట్ చేశారు.

కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి: ఇమ్రాన్
కాశ్మీర్ అంశంతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  ఆశాభావం వ్యక్తం చేశారు. షాంఘై సమ్మిట్​లో హాజరయ్యేందుకు బిష్కెక్ వచ్చిన ఖాన్ ఓ న్యూస్​ఏజెన్సీకిచ్చిన ఇంటర్వూలో ఇండియాపై తన అభిప్రాయాలు వెల్లడించారు. పాక్–ఇండియా సంబంధాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయని, ఇండియాతో శాంతిచర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని చెప్పారు.