
కాశ్మీర్ ఇష్యూపై మధ్యవర్తిత్వం చేయమని ప్రధాని నరేంద్రమోడీ తనను కోరారన్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాంట్రవర్షియల్ కామెంట్స్‌పై కేంద్రం మంగళవారం క్లారిటీ ఇచ్చింది. ట్రంప్‌కు ప్రధాని అలాంటి రిక్వెస్ట్ చేయలేదని విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ పార్లమెంట్ కు వివరించారు. కాశ్మీర్ ఇండియా-పాకిస్తాన్ దేశాలకు సంబంధించిన సమస్య మాత్రమేనని చెప్పారు. ‘‘క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాకిస్తాన్ గుడ్‌బై చెబితేనే ఆదేశంతో చర్చలు జరపడానికి అవకాశముంటుంది. కాశ్మీర్ ఇష్యూపై సిమ్లా ఎగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ ఆధారంగా మాత్రమే చర్చలు సాధ్యమవుతాయి’’ అని జైశంకర్ చెప్పారు.
ట్రంప్‌ను ఖండించే దమ్ము మోడీకి లేదా?
‘‘కాశ్మీర్ వివాదంతో మధ్యవర్తిగా ఉండాలని ప్రధాని మోడీ కోరారు’’అన్న అమెరికా ప్రెసిడెంట్ కామెంట్స్‌పై ప్రధాని మోడీ క్లారిటీ ఇవ్వాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఇండియా సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేసేలా ట్రంప్ మాట్లాడితే మోడీ మాత్రం మౌనంగా ఉండటమేంటని అపోజిషన్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఇండియా, పాకిస్తాన్ మధ్య మీడియేటర్‌గా ఉండాలని మోడీ కోరినట్లు ట్రంప్ చెబుతున్నారు. అదే నిజమైతే మోడీ సిమ్లా అగ్రిమెంట్‌కు ద్రోహం చేసినట్లవుతుంది. దీనిపై ఫారిన్ మినిస్ట్రీ ఇచ్చిన కంటితుడుపు ప్రకటన సరిపోదు. ప్రధాని నోరు తెరవాలి. తనకు, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌కు మధ్య ఏం జరిగిందో వెల్లడించాలి”అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘‘కాశ్మీర్లో మధ్యవర్తిత్వంపై ట్రంప్ కామెంట్స్‌ని వైట్‌హౌజ్ అఫీషియల్ రికార్డుల్లోనూ చేర్చారు. మన పీఎం మోడీ మాత్రం ఇంకా నిద్రలేవలేదు. ఒకవేళ నిజంగానే అలాంటి ప్రపోజల్ చేశారా?’’అని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అనుమానం వ్యక్తం చేశారు. మరో కీలక నేత, ఎంపీ శశి థరూర్ మాత్రం భిన్నంగా స్పందించారు. ‘‘నిజం చెప్పాలంటే తను మాట్లాడినదాని గురించి ట్రంప్‌కు ఎక్కువ తెలిసుంటుందనుకోను. అసలు మోడీ ఏం మాట్లాడారో, దానిపై అధికారులు ట్రంప్‌కు ఏమని బ్రీఫింగ్ ఇచ్చారో చెప్పాల్సిన బాధ్యత విదేశాంగ శాఖదే. ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య టెన్షన్ పెరగకముందే ఆ పని చెయ్యాలి”అని థరూర్ చెప్పారు. కాశ్మీర్ విషయంలో తనపై భారాన్ని దించుకోడానికే ట్రంప్ అలా మాట్లాడి ఉండొచ్చని ఎన్సీనేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. పబ్లిక్‌గా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన అమెరికా ప్రెసిడెంట్‌ని ఖండించే ధైర్యం మోడీకి లేదా? అని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు.
ఇండో–యూఎస్ రిలేషన్స్‌పై ఎఫెక్ట్!
వాషింగ్టన్: కాశ్మీర్ అంశంపై కనీస హోం వర్క్ చేయకుండా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారని, ఆయన కామెంట్స్ఇండియా–అమెరికా సంబంధాలపై ఎఫెక్ట్ చూపే అవకాశముందని మాజీ రాయబారులు, ఫారిన్ అఫైర్స్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘‘ప్రెసిడెంట్ చాలా డ్యామేజ్ చేశారు. కాశ్మీర్, అఫ్ఘానిస్థాన్‌పై ఈ తరహా వ్యాఖ్యలు ఎవరూ ఊహించనివి’’అని యూఎస్ మాజీ అంబాసిడర్ రిచర్డ్ వర్మ అన్నారు. అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ.. దక్షిణాసియా వ్యవహారాల తీవ్రత ఎలాంటిదో ట్రంప్‌కు త్వరలోనే అర్థమవుతుందనన్నారు. ‘‘అఫ్ఘాన్‌ని డీల్ చేయడానికి అమెరికాకు పాక్ సాయం కావాలి. కాబట్టే ట్రంప్.. పాక్‌కు ఏది నచ్చుతుందో అదే ఆలోచిస్తున్నానని చెప్పుకున్నారు. కిమ్ జాంగ్ని పొగిడిన నోటితోనే ట్రంప్.. ఇమ్రాన్ ఖాన్ని కూడా ఆకాశానికెత్తేశారు. డిప్లొమసీలో ఇదో భాగం. అయితే ఉత్తరకొరియా విషయంలో అమెరికా ఇప్పటిదాకా ఎలాంటి డీల్ కుదుర్చుకోలేకపోయింది. రియల్ ఎస్టేట్ డీల్ చేసుకున్నంత ఈజీ కాదు సౌత్ఏషియా సమస్యల్ని డీల్ చేయడం రియల్ ఎస్టేట్ ఒప్పందం కుదుర్చుకున్నంత ఈజీ కాదని ట్రంప్‌కు త్వరలోనే తెలిసొస్తుంది”అని హక్కానీ వివరించారు. ‘‘దౌత్యవ్యవహారాల్లో చెప్పే విషయంలో క్లారిటీ, వాడే భాష, ఆ అంశానికి సంబంధించిన చరిత్రపై అవగాహన చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తూ ట్రంప్ ప్రకటనలో అవేవీ లేవు’’అని మాజీ డిప్లొమాట్ అలేజా ఐరెస్ అభిప్రాయపడ్డారు. ‘‘కాశ్మీర్ విషయంలో ఇండియా స్టాండ్ మారలేదు. ఇది రెండు దేశాలు పరిష్కరించుకోవాల్సిన సమస్య. మూడో వ్యక్తి లేదా సంస్థ ప్రమేయాన్ని అంగీకరించం. ముందుగా పాక్ తన టెర్రరిస్టు కలాపాల్ని మానుకుంటేనే చర్చలపై ముందుకు వెళ్తాం”అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు.
హురియత్ లీడర్ల స్వాగతం
ట్రంప్ మీడియేషన్ కామెంట్స్ ను హురియత్ సీనియర్ నాయకులు సయ్యద్ అలీ జిలానీ, మీర్వాజ్ ఉమర్ ఫరూఖ్ స్వాగతించారు. సమస్య తొందరగా పరిష్కారం కావాలని కాశ్మీరీ ప్రజలు కోరుకుంటున్నారని ఉమర్ ఫరూఖ్ చెప్పారు. అన్ని స్థాయిల్లోనూ చర్చలు జరపాలని ఆయన కోరారు. కాశ్మీరు స్వాతంత్రం కోసం అమెరికా తన పాత్రపోషించాలని జిలానీ కోరారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించినందుకు పాకిస్తాన్‌కు ఆయన థాంక్స్ చెప్పారు.