
మన్ కీ బాత్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులు అద్భుత విజయాలు సాధించారని కొనియాడారు. ఇటీవల జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మన ఆటగాళ్లు ఎన్నో రికార్డులు నమోదు చేశారని... ఈ గేమ్స్ లో మొత్తం 12 రికార్డులు బద్దలయ్యాయని అన్నారు. వాటిలో 11 రికార్డులు మహిళా క్రీడాకారుల పేర్లపై నమోదయ్యాయన్న ప్రధాని... ఈ సారి జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మరో మరో ప్రత్యేకత ఉందని చెప్పారు. ఈ క్రీడల వల్ల సాధారణ కుటుంబాల నుండి వచ్చిన ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారని.. ఈ ఆటగాళ్ళు తమ జీవితంలో చాలా కష్టపడ్డి, విజయం దశకు చేరుకున్నారని మెచ్చుకున్నారు.
రోజు రోజుకూ భారత ఆటగాళ్ల ప్రాబల్యం కూడా పెరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. భారతీయ క్రీడలకు కూడా కొత్త గుర్తింపు వస్తోందన్న ఆయన.. గట్కా, తంగ్ టా, యోగాసన, కలరిపయట్టు, మల్లాఖంబ్ లాంటి ఐదు స్వదేశీ క్రీడలు చేరడమే దానికి చక్కని ఉదాహరణ అని చెప్పారు. ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో మన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో రజతం గెలుచుకుని... తన రికార్డును తానే బద్దలు కొట్టాడని అన్నారు. దీంతో నీరజ్ చోప్రా దేశం గర్వించేలా చేశాడని మోడీ మన్ కీ బాత్ లో చెప్పుకొచ్చారు.