ప్రతి నిర్ణయం జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదిక కావాలె

 ప్రతి నిర్ణయం జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదిక కావాలె

న్యూఢిల్లీ: బ్యూరోక్రాట్లు తీసుకునే ప్రతి నిర్ణయానికి జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదిక కావాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. దేశ నిర్మాణంలో సివిల్ సర్వెంట్ల పాత్ర ఎంతో కీలకమని, వాళ్ల భాగస్వామ్యం లేకుండా దేశం వేగంగా అభివృద్ధి చెందడం అసాధ్యమని అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా శుక్రవారం ‘వికసిత్ (అభివృద్ధి చెందిన) భారత్ ’ థీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. బ్యూరోక్రాట్లను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘ఇండియా టైమ్ వచ్చిందని ప్రపంచం చెబుతున్నది. దేశంలోని బ్యూరోక్రసీ సమయం వృథా కాకూడదు. దేశం మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేయండి. రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే నిర్ణయాలన్నింటికీ జాతీయ ప్రయోజనాలే ఎల్లప్పుడూ ప్రాతిపదికగా ఉండాలి’’ అని సూచించారు. 

మీ పనిని బట్టే మీకు గౌరవం..

‘‘ప్రతి పౌరుడి ఆకాంక్షలకు భారత ప్రభుత్వ వ్యవస్థ మద్దతుగా నిలవడం వికసిత్ భారత్‌‌‌‌‌‌‌‌కు ముఖ్యం. పౌరులు తమ కలలను సాకారం చేసుకోవడంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సాయంచేస్తారు. గతంలో ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న నెగెటివిటీ ఇప్పుడు పాజిటివిటీగా మారింది” అని ప్రధాని వివరించారు. ‘దేశం ముందు.. పౌరుడు ముందు’ అనేదే తమ నినాదమని చెప్పారు. ‘‘జీవితంలో రెండు దారులు ఉంటాయి. మొదటిది.. పనులను పూర్తి చేయడం. రెండోది..  పనులను వాటంతట అవే జరగనివ్వడం. మొదటిది యాక్టివ్ వైఖరిని, రెండోది పాసివ్ వైఖరిని ప్రతిబింబిస్తుంది. పనులు పూర్తి చేయాలని భావించే వ్యక్తులు చురుకైన పద్ధతిలో లీడ్ తీసుకుంటారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆశయం ఉంటే.. మీరు చిరస్మరణీయ వారసత్వాన్ని వదిలి వెళ్తారు. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చారనే దాన్ని బట్టి మిమ్మల్ని అంచనా వేస్తరు” అని వివరించారు.

సూడాన్ పరిస్థితులపై సమీక్ష

సూడాన్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అక్కడి భారతీయుల భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. అత్యవసరంగా తరలింపు ప్లాన్లను సిద్ధం చేయాలని సూచించారు.

సుపరిపాలనే కీలకం

‘‘సుపరిపాలనే కీలకం. పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్.. సమస్యలను పరిష్కరిస్తుంది. మెరుగైన ఫలితాలను అందిస్తుంది” అని ప్రధాని అన్నారు. ‘‘ఒక రాజకీయ పార్టీ.. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నదా.. లేక దేశం కోసమా? ఆ డబ్బును ఓటు బ్యాంకును ఏర్పరుచుకోవడం కోసం వినియోగిస్తున్నదా.. లేక ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తున్నదా? ప్రభుత్వ ఖజానాలోని నిధులతో సొంత ప్రకటనలు ఇస్తున్నదా.. లేక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదా? వివిధ ఆర్గనైజేషన్లలో సొంత పార్టీ కార్యకర్తలను నియమిస్తున్నదా.. లేక రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం పారదర్శక ప్రక్రియను రూపొందిస్తున్నదా?.. వంటివి విశ్లేషించడం బ్యూరోక్రసీ కర్తవ్యం. యువకుల కలలు చెదిరిపోకుండా, పన్ను చెల్లింపుదారుల సొమ్ము నాశనం కాకుండా చూసుకుంటూ.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా జీవించాల్సిన సమయం ఆసన్నమైంది” అని మోడీ వివరించారు.